
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
చతేశ్వర్ పుజారా. ఒక దశాబ్దానికి పైగా ఇండియా క్రికెట్‌లో కీలక ఆటగాడు. అతనెప్పుడూ విరాట్ కోహ్లీ లాంటి కళ్లు చెదిరే కవర్ డ్రైవ్స్ ఆడలేదు. రిషబ్ పంత్ లాగా కింద పడిపోతూ కొట్టే హుక్ షాట్‌తో ఆశ్చర్యపరచలేదు. రోహిత్ శర్మ లాంటి సునాయాసమైన పుల్ షాట్‌తో అభిమానులను ఉర్రూతలూగించలేదు. కానీ, తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. టీ20ల హవాలో.. స్టయిలిష్ బ్యాటర్ల యుగంలో 2013 నుంచి 2023 వరకు ఒక దశాబ్ద కాలంలో వందకు పైగా టెస్టు మ్యాచ్‌ల్లో ఇండియా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు పుజారా. చతేశ్వర్ పుజారా తన అద్భుతమైన కెరీర్ కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు.
ఇండియా క్రికెట్‌కు అతను చేసిన సేవను సిక్సర్లు, స్ట్రయిక్-రేట్లతో కొలవలేం. అతని విలువ క్రీజులో గడిపిన సమయంలో, ఏ క్షణంలోనైనా పోరాటాన్ని వదలని తీరుతో, ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొనేందుకు చూపెట్టిన తెగువలో ఉంది. ఇండియా టెస్ట్ బ్యాటింగ్ అనే అందమైన భవనానికి విరాట్ కోహ్లీ నిర్మాణం అయితే, పుజారా నిస్సందేహంగా దానికి పునాది. టెస్ట్ క్రికెట్‌కు మూలస్తంభమైన సహనానికి మారు పేరుగా నిలిచిన పుజారా.. ఒకప్పుడు రాహుల్ ద్రవిడ్ ఆడిన మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ‘ది వాల్’ వారసత్వాన్ని కొనసాగించాడు.
ఆస్ట్రేలియాలో అద్భుతాలు
పుజారా కీర్తికి ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన విజయాలే నిలువుటద్దం. ముఖ్యంగా 2018-–19, 2020–-21 బోర్డర్–గావస్కర్ ట్రోఫీల్లో అతని ఆట చారిత్రాత్మకం. 2018–-19 సిరీస్‌లో పుజారా ఏకంగా 1,258 బాల్స్ ఎదుర్కొని మూడు సెంచరీలతో 521 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ వాళ్లను మానసికంగా దెబ్బతీశాడు. ఇక 2021 గబ్బా టెస్టులో అతని పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. నాడు పుజారా కేవలం బ్యాటర్‌గా కాకుండా యుద్ధక్షేత్రంలో వీరుడిగా ఆసీస్ బౌలర్లకు ఎదురు నిలిచాడు.
కమిన్స్, హేజిల్‌వుడ్ విసిరిన బంతులు అతని హెల్మెట్‌కు, పక్క టెముకలకు, చేతులకు తగులుతూనే ఉన్నాయి. శరీరంపై దాదాపు 11 సార్లు బంతి బలంగా తాకింది. అయినా సరే తను క్రీజును వదల్లేదు. పోరాటం ఆపలేదు. 211 బాల్స్‌లో 56 రన్స్ చేసి తన కెరీర్‌లోనే స్లోయెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. కానీ ఆ ఇన్నింగ్స్ విలువ రిషబ్ పంత్ వీరోచిత ఇన్నింగ్స్‌కు పునాది వేసి ఇండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది. పుజారా శరీరంపై అయిన గాయాలేఅతనికి గౌరవ పతకాలుగా నిలిచిపోయాయి.
తండ్రి దిద్దిన చాంపియన్
క్రికెటర్ల ఫ్యామిలీలో పుజారాకు ఆటపై ప్రేమతో పాటు పట్టుదల, క్రమశిక్షణ చిన్నతనం నుంచే అలవాటయ్యాయి. తండ్రి అరవింద్ పుజారా, చిన్నాన్న బిపిన్ పుజారా ఇద్దరూ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లే. ఇండియాకు ఆడాలన్న తన కలను కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలనుకున్న అరవింద్.. పుజారాకు తొలి గురువు. టీ20లపై మక్కువ పెరుగుతున్న టైమ్‌లోనూ టెస్టు క్రికెట్టే.. అసలైన క్రికెట్ అని కొడుకులో నూరిపోశాడు. ఎప్పుడూ ఆటపై దృష్టి పెట్టాలని చెప్పేవాడు. చిన్నప్పుడు పండగలకు కూడా సెలవు ఇచ్చేవాడు కాదు.
చివరకు దీపావళికి టపాసులు కాల్చడానికి, గాలిపటాలు ఎగరేయడానికి కూడా పుజారాకు అనుమతి ఉండేది కాదు. ‘చేతికి గాయమైతే నెట్స్‌కు దూరం కాకూడదనేది’ అతని తండ్రి సిద్ధాంతం. ఈ క్రమశిక్షణే అతన్ని గొప్ప ఆటగాడిగా మార్చింది. పుజారా 17 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు అతని తల్లి క్యాన్సర్‌తో చనిపోయింది. ఒక మ్యాచ్ ఆడి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తనకు ఈ వార్త తెలిసింది. ఆ బాధను ఎవరితోనూ పంచుకోకుండా తనలోనే దాచుకున్నాడు. ఆ ధైర్యమే, అతన్ని క్రికెట్ మైదానంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనేలా చేసింది.
పుజారా ప్రత్యేకం
పుజారా వ్యక్తిత్వం కూడా ప్రత్యేకం. తన భార్య పూజ తన పుస్తకంలో చెప్పినట్లుగా చతేశ్వర్ చాలా తక్కువ మాట్లాడతాడు. ఒక చిరునవ్వుతో పని పూర్తయితే, తను మాట్లాడటానికి ఇష్టపడడు. ఆర్భాటాలకు, అనవసరమైన హడావిడికి పూర్తిగా దూరం. ఈ రోజుల్లో క్రికెటర్లు స్ట్రయిక్ రేట్లు, ఐపీఎల్ కాంట్రాక్టులు, సోషల్ మీడియా హడావిడి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ పుజారా ఎప్పుడూ ఆధునిక క్రికెటర్ లాగా ఉండటానికి ప్రయత్నించలేదు. టీవీలో ప్రకటనలు, సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోషన్ల వంటివి లేకుండా దేశం కోసం నిస్వార్థంగా బ్యాటింగ్ చేశాడు.
టెస్టుల్లో 7 వేలకు పైగా రన్స్,19 సెంచరీలు సాధించినా పుజారాకు దక్కాల్సినంత ప్రశంసలు దక్కలేదని చాలా మంది భావిస్తారు. ఇందులో నిజం ఉంది. కానీ పుజారాకు ఆ ప్రశంసలు అవసరం లేదు. ఎందుకంటే అతనికి ఆట, పోరాటం మాత్రమే ముఖ్యం. అందుకే టెస్ట్ చరిత్రలో ఓపికకు, నిబద్ధతకు, ధైర్యానికి ఉదాహరణగా.. నిస్వార్థ సేవకుడిగా పుజారా ఎప్పటికీ గుర్తుండిపోతాడు.