అలసిన కన్నులకు నిదుర ఆమె పాట

అలసిన కన్నులకు నిదుర ఆమె పాట

విస్తారమైన మాటలతో చెప్పలేని భావాలెన్నంటినో ఒక చిన్న పాట చెప్పగలదు. పదిలంగా పేర్చిన పంక్తులతో వాస్తవాలను బలంగా గుండెల్లో ముద్రించగలదు.
అందుకే ప్రతి ఒక్కరూ పాటను ప్రేమించేది!శ్రావ్యమైన సంగీతం.. అర్థవంతమైన సాహిత్యం కలగలిసిన అందమైన గీతం ఓ ఆరితేరిన గాయని స్వరంలోంచి జాలువారినప్పుడు దాని విలువ మరింత పెరుగుతుంది.దాని ప్రభావం ఊహించినదానికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది.అలా పాటకు విలువను పెంచిన గ్రేట్‌ సింగర్స్ లో ఆశాభోంస్లే ఒకరు. ఆమె గొంతు విప్పితే అమృతాన్ని కుమ్మరించినట్టుంటుంది.ఆమె పాటందుకుంటే జలపాతం గలగలపారినట్టుంటుంది.ఆమె ఆలపించిన జోలపాట అమ్మ పాట కంటే కమ్మగా ఉంటుంది.ఆమె గొంతు నుంచి జారిన విషాద గీతం శ్రోత కళ్లలో కన్నీటి కెరటమై పొంగి పొర్లుతుంది.మత్తుగా వినిపించే ఆ స్వరం ప్రేమసాగరంలో ముంచి లేపుతుంది.అల్లరిగా ఆటలాడిన తన గాత్రం యువత గుండెలకు చిలిపి రెక్కలు తొడిగి విహరింపజేస్తుంది.ఒకటా రెండా.. ఎన్ని వేల పాటలు! ప్రతిదీ ఆణిముత్యమే. ప్రతి గీతం మధురామృత కలశమే. 

‘హాల్ కైసా హై జనాబ్‌కా’ అంటూ ఎంత అందంగా పలకరించిందని!‘దమ్ మారో దమ్‌’ అంటూ ఎంత హంగామా సృష్టించిందని!‘పర్‌‌దేమే రెహ్‌నేదో పర్‌‌దా న ఉఠావో’ అంటూ ఎన్ని సిగ్గులు ఒలకబోసిందని!‘చురాలియాహై తుమ్‌నే జో దిల్‌కో’ అంటూ ఎంత చిలిపిగా రెచ్చగొట్టిందని!‘దో లఫ్జోంకీ హై దిల్‌కీ కహానీ’ అంటూ ఎంత అందమైన కథలు చెప్పిందని!‘కభీ తో నజర్ మిలావో’ అంటూ ప్రేమని ఎంత అందగా ఆహ్వానించిందని!‘ఆజ్ జానేకీ జిద్‌నా కరో’ అంటూ ఎంత జాలిగా వేడుకుందని! ‘రాధ కైసే న జలే’ అంటూ ఎంతగా ఉడుక్కుందని!‘రంగీలారే’ అంటూ యువత కళ్లకి ఎన్ని అందమైన రంగులు చూపించిందని!అల్లరి వయసుకు ఆటవిడుపు ఆమె పాట. చల్లని వేళ ప్రేమ పిలుపు ఆమె పాట.అలసిన కన్నులకు నిదుర ఆమె పాట. విరిగిన మనసుకు ఓదార్పు ఆమె పాట. ‘మౌనమే ప్రియా గానమై’ అంటూ స్వరం తెలుగు ప్రేక్షకుల చెవులకు కూడా సోకింది.‘నాలో ఆశలకు నాలో ఊసులకు ఊపిరి పోశావు’ అంటూ చందమామతో చిలిపి ఊసులాడించింది.ఆ స్వరానికి భాషా భేదం తెలీదు.. అలవోకగా హృదయాలను అల్లుకుపోవడం తప్ప.ఆ గాత్రానికి అడ్డూ అదుపూ తెలీదు.. వెల్లువలా ఎగసిపడి ఎవ్వరినైనా ముంచేయడం తప్ప. ఎందుకంటే ఆ స్వరం, గాత్రం ఆశా భోంస్లేది.పరవశింపజేయడం.. స్వర సాగరంలో ఓలలాడించడం ఆమెకు సరిగమలతో పెట్టిన విద్య.ఆశాదీ.. ఆజ్‌కా దిన్‌ ఆప్‌కే నామ్!హ్యాపీ బర్త్ డే.