ఆత్మహత్య వద్దు.. ఆలోచనే ముద్దు

ఆత్మహత్య వద్దు.. ఆలోచనే ముద్దు

ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం.. ఆక్రోశం.. ఏదో ఒక కారణం..ఏదో ఒక ఆందోళన.. మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. సమస్యలను ఎదుర్కోలేని మానసిక బలహీనతే ఆ పని చేయిస్తోంది. అలా అర్థంతరంగా తనువు చాలిద్దామనుకున్న వారిలో ఆలోచన రగిలేలా చేయాలంటోంది సమాజం. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్న వారిలో ఆలోచన రగిలిస్తే.. చైతన్యం తీసుకొస్తే గండం గడచిపోతుంది. కళ్లు పోగొట్టుకున్న లూయీ బ్రెయిలీ, కాళ్లు పోగొట్టుకున్న సుధాచంద్రన్ లాంటివారు సాధించిన చిరస్మరణీయ విజయాలను గుర్తుకు తెచ్చుకుంటే ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మళ్లీ బతకాలనే ఆశ చిగురిస్తుంది. అదే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 10న ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.

ఇలా మొదలైంది.. 

ఆత్మహత్యల నివారణ దినం మొదటిసారి 2003 సంవత్సరంలో సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల కేసులను తగ్గించడానికి చొరవ తీసుకున్నాయి. ఆత్మహత్యల కేసులను తగ్గించడానికి 60కి పైగా దేశాలలో వందలాది కార్యక్రమాలను ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఆత్మహత్యలు చేసుకునే వారు ఒక్క క్షణం ఆలోచిస్తే..ఆ ధైర్యమే జీవితాన్ని ముందుకు నడిపిస్తుందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు కృషి చేస్తున్నాయి. 

చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి..

‘ఆత్మహత్య మహాపాపం’ అని అభివర్ణించారు పెద్దలు. ఆత్మహత్యలకు పాల్పడే వారిని 'పిరికిపందలు' అని అన్నారు ఆధునికులు. ‘ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే.. అంతకు ముందు ఒక ప్రజాకంటకున్ని తుదముట్టించు’ అని  మహాకవి శ్రీశ్రీ సందేశం ఇచ్చారు. ‘కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం..రెప్పపాటే కదా జీవితం’ అని అంటాడు ఓ కవి. అయితే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువవుతున్నారు.  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, జీవితంలో పెరిగిపోతున్న యాంత్రికత, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నాయనేది మానసిక విశ్లేషకుల అభిప్రాయం. వార్తాపత్రిక తెరిచినా.. టీవీలో వార్తలు చూసినా ప్రతిరోజూ కామన్ గా కనిపించే వార్తల్లో ఆత్మహత్య ఒకటి. సెలబ్రిటీల నుంచి సాధారణ గృహిణుల వరకు.. రైతుల నుంచి విద్యార్థుల వరకు ఇలా ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతూ తమ కుటుంబాలకు తీరని వేదనను మిగులుస్తున్నారు.

ఏటా 10లక్షల మంది..

ప్రపంచవ్యాప్తంగా ఏటా 10లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంటే.. ప్రతి 40 సెకండ్లకు ఒకరు సూసైడ్ కు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 15 నుంచి 29 ఏళ్లవారే ఎక్కువగా ఉండటం విచారకరం. ఆత్మహత్యలు చేసుకునేవారిలో చాలా మంది డిప్రెషన్‌కు లోనైన వారే. సున్నిత మనస్కులు, హిస్టీరికల్ మనస్తత్వం ఉన్న వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. వ్యక్తిగత ఘర్షణలు, హత్యలు, యుద్ధాలు, ప్రమాదాలతో మరణించే వారికన్న ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ఆత్మహత్యలో సఫలం అయిన వారి  సంఖ్య కన్నా.. ఆత్మహత్యకు యత్నించి విఫలమైన వారి సంఖ్యే అంతకు ఇరవై రెట్లు ఎక్కువ. అంటే.. ప్రతి 3 సెకండ్లకు ఈ భూమండలం మీద ఏదో ఒక మూలన ఒక ఆత్మహత్యాయత్నం జరుగుతోందన్న మాట. 

మనదేశంలో ఆత్మహత్యలు ఎక్కువే..

ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే మనదేశంలో ఆత్మహత్యలు ఎక్కువే.  ఆత్మహత్యల విషయంలో మనదేశం 22వ ర్యాంకులో ఉంది. ఏటా లక్షా 35 వేలమంది ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేరళ,తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతుండగా.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బీహార్ రాష్ట్రంలో మాత్రం అతి తక్కువ బలవన్మరణాలు చోటుచేసుకుంటుండటం గమనార్హం. 1987 - 2007 మధ్య కాలంలో దేశంలో ఆత్మహత్యలు 7.9 నుంచి 10.3 శాతానికి పెరిగాయి. రైతుల ఆత్మహత్యలు కూడా ఈ వ్యవధిలో బాగా ఎక్కువయ్యాయి. 

ఏడో స్థానంలో తెలంగాణ..

ఆత్మహత్యల్లో తెలంగాణా రాష్ట్రం దేశంలో ఏడో స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు మహారాష్ట్రలో జరుగుతున్నాయి. అక్కడ ఎక్కువగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఆత్మహత్యల్లో రెండో స్థానంలో తమిళనాడు ఉంది. ఈ జాబితాలో తెలంగాణా రాష్ట్రం ఏడో స్థానంలో ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలోనే చిన్న రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ.. ఆత్మహత్యల్లో మాత్రం తెలంగాణ ఏడో స్థానంలో ఉండటం అటు తెలంగాణా సర్కార్ ను, ఇటు ప్రజలను ఆలోచించేలా చేస్తోంది. 
 
ఆత్మహత్య ఆలోచనలున్నవారిని గుర్తించడం ఇలా.. 

ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరి తనాన్ని ఇష్టపడటం, నిరాశా నిస్పృహలు, ప్రతి విషయం గురించీ ప్రతికూలంగా ఆలోచించటం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, అతను/ఆమె ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి.

స్నేహపూర్వక మాటలతోనే.. తొలి చికిత్స

ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించే వారిని గుర్తించిన వెంటనే.. వారితో సాధ్యమైనంత త్వరగా స్నేహపూర్వకంగా మాట్లాడాలి. ప్రధానంగా ఇలాంటి వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యం చెప్పాలి. కనీసం మంచి మాటల ద్వారా.. అండగా ఉన్నామనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఓపికగా వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి. వారు చెప్పే పాయింట్స్ ను అర్థం చేసుకుని, కొన్ని పరిష్కార మార్గాలను సూచించాలి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగబంధం బలపడేలా ప్లాన్ చేయాలి. 

మానసిక వైద్యమంటే నామోషీ వద్దు..

ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి.మనలాంటి చాలా దేశాల్లో మానసిక వైద్యం అంటే నామోషీ. మానసిక వైద్య చికిత్స అంటే.. అదేదో పిచ్చిపట్టినవాళ్లకు అందించే చికిత్స అనే భావన ప్రజల మెదళ్లలో నాటుకుపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువైంది. అందువల్లే ఆసియా దేశాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటోంది. చాలావరకు ఆత్మహత్య కేసులను నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. ఆత్మహత్యకు ముందు, కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా దానిని నివారించవచ్చని చెబుతున్నారు. జీవితంపై సానుకూల ధోరణిలో ఒక్క క్షణం ఆలోచించినా ఆత్మహత్యను నివారించడం సులభమని అభిప్రాయపడుతున్నారు. సమస్యలను, బాధలను సన్నిహితంగా ఉండే బంధువులు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.