ప్రగతిభవన్‌‌కు వెళ్లాలంటే ప్రత్యేక వీసా కావాలె : బూర నర్సయ్య గౌడ్

ప్రగతిభవన్‌‌కు వెళ్లాలంటే ప్రత్యేక వీసా కావాలె : బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: సొంత పార్టీ ఎమ్మెల్యేలనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి సీఎం కేసీఆర్ దిగజారారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. మునుగోడులో ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి ఒక్కో బూత్‌‌లో కనీసం 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని సీఎం ఆదేశించారని ఆరోపించారు. నియోజకవర్గాలను వదిలి మునుగోడులో మకాం వేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీలో చేరిన తర్వాత గురువారం తొలిసారి బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చిన బూర నర్సయ్యకు పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి స్వాగతం పలికారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే నిర్బంధాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. టీఆర్ఎస్‌‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందో ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ ప్రజలు బానిసలు కాదని, ఆత్మగౌరవం కోసం బతికేవారన్నారు. రాజకీయ బానిసత్వం అంతం అయ్యేందుకు, తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పోయేందుకు, బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు రాజసూయ యాగం చేయనున్నట్లు చెప్పారు.

ప్రగతిభవన్‌‌కు వెళ్లాలంటే ప్రత్యేక వీసా కావాలి

ఆత్మాభిమానం కోసమే ఈటల రాజేందర్, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి.. ఇప్పుడు తాను టీఆర్ఎస్‌‌ను వీడామని బూర నర్సయ్య చెప్పారు. బీజేపీలో అందరూ ఉద్యమ నేతలే ఉండడంతో తనకు ఇక్కడ కొత్తగా అనిపించడం లేదన్నారు. బీజేపీ ఇప్పుడు ఉద్యమ పార్టీ అయితే.. టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారిందని విమర్శించారు. ప్రగతి భవన్‌‌కు వెళ్లాలంటే ప్రత్యేక వీసా కావాలని, అక్కడ సీఎం దర్శనం కావాలంటే సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పట్టవచ్చన్నారు. టీఆర్ఎస్ మాదిరి తాము రాజకీయం మీద వ్యాపారం చేయబోమన్నారు. కేసీఆర్‌‌‌‌పై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఆ తర్వాత వీఆర్ఎస్.. ఇది కేసీఆర్ ప్లాన్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కారణంగానే కేసీఆర్.. గట్టుప్పల్ మండలం ఇచ్చారని చెప్పారు. కేసీఆర్‌‌‌‌కు ఓట్లు, సీట్లు, నోట్లే ముఖ్యమని.. ఇది తాను చెప్పడం లేదని, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఉప ఎన్నిక తర్వాత వరదలా బీజేపీలోకి చేరికలు ఉంటాయన్నారు. ఫ్లోరోసిస్ పోయిందని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు.. ఫ్లోరోసిస్ అధ్యయన కేంద్రం కావాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. లేని రోగానికి వైద్యం చేయడానికేనా అని నిలదీశారు. బీజేపీ చీఫ్ నడ్డాకు సమాధి కట్టడం టీఆర్ఎస్ నేతల పనేనని, వినాశకాలే విపరీత బుద్ధిలా ఆ పార్టీ వ్యవహరిస్తున్నదన్నారు.