23 ఏండ్ల తర్వాత.. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం

23 ఏండ్ల తర్వాత.. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం
  • 2002 ఓటర్ ​లిస్ట్​తో తాజా లిస్ట్​మ్యాచ్​ చేస్తున్న అధికారులు​
  • అప్పటినుంచి ఇప్పటివరకు పెరిగిన ఓటర్లు 5,46,049 మంది
  • మొత్తం ఓటర్లు 29,76,518 మంది
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు

యాదాద్రి, వెలుగు: స్పెషల్​ఇంటెన్సివ్​రివిజన్ (సర్)పై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీని కారణంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే బిహార్​లో లక్షల ఓట్లు తొలగించారని కాంగ్రెస్​ సహా ప్రతిపక్షాలు ఆరోపించడంతోపాటు మీడియాలో కథనాలు వచ్చాయి. కొందరు కోర్టును ఆశ్రయించారు. పారదర్శక ఓటరు జాబితా కోసం దేశవ్యాప్తంగా సర్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్​ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పరిణామంతో ఓటర్ల మార్పులు చేర్పులు, తొలగింపు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. 

2002లో పెద్ద ఎత్తున మార్పులు

2002లో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు, తొలగింపు జరిగాయి. కొన్ని పల్లెలు పట్టణాలుగా మారిపోయాయి. ప్రజలు ఉపాధి, ఉద్యోగాల కోసం తరచూ ఒకచోటు నుంచి మరోచోటుకు వలస వెళ్లారు. ఓటు నమోదు చేసుకున్న చోట నివాసం ఉండకుండా ఇంకోచోట ఉంటున్నారు. అయితే చాలామంది ఓట్లు గతంలో నమోదు చేసుకున్న గ్రామాలు లేదా పట్టణాల్లో ఉన్నాయి. కొందరు రెండుచోట్ల ఓటుహక్కు కలిగి ఉన్నారు.  

లిస్ట్​ పంపించిన ఎన్నికల కమిషన్

జిల్లాల్లో సర్​నిర్వహణ కోసం 2002లోని ఓటర్ లిస్ట్​ను ఎన్నికల కమిషన్ పంపించింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడికక్కడ ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి ఓటర్ల వివరాలను 2025 జనవరిలో రిలీజ్​చేసిన ఫైనల్​ ఓటర్​లిస్ట్​తో మ్యాచ్​చేస్తున్నారు. మండలాల వారీగా 2002 లిస్ట్​లోని ఓటర్ల పేర్లు ప్రస్తుత జాబితాలో ఉన్నాయా.. లేవా అని పరిశీలిస్తున్నారు. అప్పటి జాబితాలో లేకుండా 2025 లిస్ట్ లో ఉన్నవారి పేర్లతో ప్రత్యేకంగా జాబితా​ రూపొందిస్తున్నారని తెలిసింది.  

మారిన ఓటర్ల సంఖ్య

గడిచిన 23 ఏండ్లలో ఓటర్ల సంఖ్య మారిపోయింది. చనిపోయిన వారి పేర్ల తొలగింపు, మార్పులు చేర్పుల అనంతరం 2025 జనవరిలో ఎన్నికల కమిషన్​ రిలీజ్ ​చేసిన ఫైనల్​ లిస్ట్​ ప్రకారం.. ఓటర్ల సంఖ్య 29,76,518కు చేరింది. వీరిలో పురుషులు 14,63,142, మహిళలు 15,11,939, సర్వీస్​ ఓటర్లు 1,183, థర్డ్​జెండర్లు 205 మంది ఉన్నారు. ఈ లెక్కన 5,46,049 ఓటర్లు పెరిగారు. అయితే 2002లో ఓటర్లుగా ఉన్నవారి పేర్లు కూడా సర్ లిస్ట్​లో లేవు.  వారితోపాటు ఆ తర్వాత ఓటర్లుగా నమోదైన వారు తమ స్థానికతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తమ తల్లిదండ్రులకు సంబంధించిన గుర్తింపును సైతం చూపించాలి.

2 నియోజకవర్గాలు రద్దు

ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. పునర్విభజన తర్వాత కూడా ఈ సంఖ్య మారలేదు. కానీ నియోజకవర్గాల సరిహద్దులు మారాయి. 2 నియోజకవర్గాలు రామన్నపేట, చలకుర్తి రద్దయి.. వాటి స్థానంలో నాగార్జున సాగర్, హుజూర్​నగర్​కొత్తగా ఏర్పాటయ్యాయి. మిర్యాలగూడ లోక్​సభ స్థానంలో భువనగిరి ఏర్పడింది. 2002 సర్ లిస్ట్​ప్రకారం ఉమ్మడి జిల్లాలోని పాత 12 నియోజకవర్గాల్లో 24,30,469 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 12,15,880 మంది, మహిళలు 12,14,551, థర్డ్​జెండర్లు 38 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ జాబితాను ఎన్నికల కమిషన్​ సిబ్బంది పరిశీలిస్తున్నారు.