హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. రాష్ట్రమంతా నిఘా నేత్రం

హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. రాష్ట్రమంతా నిఘా నేత్రం

దేశంలోనే తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ లో అందుబాటులోకి రానుంది. దీన్ని సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాలకు ప్రారంభించనున్నారు. దీనితో పాటు సీఎం ఛాంబర్, సీపీ చాంబర్లను కూడా కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, డీజీపీ, సిటీ సీపీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.  కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పోలీసు శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. అయితే దీని గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడానికి గల కారణాలేంటీ..? అసలు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏమేం ప్రత్యేకతలున్నాయి..? అనే విషయాలను తెలుసుకుందాం.

అన్ని విభాగాలూ ఒకే దగ్గరికి....

తెలంగాణ స్టేట్  ఇంటిగ్రేటెడ్  కమాండ్  అండ్  కంట్రోల్  సెంటర్  లేటెస్ట్ టెక్నాలజీకి కేరాఫ్  అడ్రస్  గా మారనుంది. అత్యాధునిక సాంకేతికతతో దీన్ని నిర్మించారు. నగర కమిషనరేట్  పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్ ఫోర్స్, స్పెషల్  బ్రాంచ్ .. ఇలా అన్ని విభాగాలనూ ఒకే దగ్గరకి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ ప్రాంతాలలకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలు కానుంది. కమాండ్ , కంట్రోల్ సెంటర్ లో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అని డిపార్ట్ మెంట్ల చీఫ్ లు ఒకే దగ్గర సమావేశమై నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్  స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీని కోసం ఏడో అంతస్తులో సీఎం, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల చీఫ్ లకు ఛాంబర్లు ఉన్నాయి.

కంప్యూటర్ మ్యాపింగ్ తో మానిటరింగ్

డయల్ – 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్  ఐ... ఇలాంటి వ్యవస్థలన్నీ ఒకే దగ్గర ఉండనున్నాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి కంప్లైంట్లు వచ్చిన వెంటనే నిమిషం ఆలస్యం లేకుండా వెంటనే స్పందించేలా కంప్యూటర్  ప్రొగ్రామింగ్  ఉండనుంది. జీపీఎస్  పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్  బ్యాంకులతో లింకు చేయనున్నారు.  పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్లను విభాగాల వారీగా కేటాయింపు, సత్వర స్పందన, పరిష్కారం, వీటి మ్యాపింగ్  మొత్తం కంప్యూటర్  తోనే జరుగుతుంది. మార్కెట్, సోషల్  మీడియా విశ్లేషణ, మెబైల్  యాప్స్  కంప్లైంట్ల పరిష్కారానికి స్పెషల్ వ్యవస్థ ఉంటుంది. ఇక సిటీ మొత్తంలో ఉండే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్న విజువల్స్ ను భారీ వీడియో వాల్  సాయంతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు. ప్రత్యేక ఎనలటిక్స్ గా పిలిచే సాఫ్ట్  వేర్స్  తో శాంతిభద్రతల పరిస్థితుల్ని అంచనా వేస్తారు. జీపీఎస్  టెక్నాలజీతో ఉన్న వాహనాలను అవసరమైన చోటుకు మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. 

కేసుల సత్వర పరిష్కారానికి...

FIR మొదలు కేసుల స్టేటస్ ను  తెలుసుకోవడంతో పాటు, నేరగాళ్ల డేటాబేస్  నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్  మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్  ఇన్వెస్టిగేషన్  లాబ్  ఇతర టూల్స్  నేరాల కంట్రోల్, కేసుల సత్వర పరిష్కారానికి ఉపయోగపడనున్నాయి. నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్ వేర్  ఎనలటికల్  టూల్స్  అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్స్  సెర్చ్ కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్  డిజైనింగ్  టూల్స్ తో మెరుగైన సేవలు అందించనున్నారు.

ఈ నెలాఖరు లోపు షిఫ్టింగ్...

సిటీ పోలీసు కమిషనరేట్  ను ఈ నెలాఖరు లోపు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు షిప్ట్ అవనుంది. 18 వ అంతస్తులో సిటీ సీపీ ఆఫీస్ ఉండనుంది. కమాండ్,  కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్  సెంటర్, ట్రాఫిక్  కంట్రోల్  రూమ్  కూడా ఇక్కడికే వెళ్తాయి. ఇవి ఐదో అంతస్తులో ఉండనున్నాయి. ఏడో ఫ్లోర్ ను వివిధ డిపార్ట్ మెంట్ల కోసం కేటాయించారు. ప్రస్తుతం బషీర్ బాగ్  లోని పోలీసు కమిషనరేట్  సిటీ ట్రాఫిక్  కమిషనరేట్  గా మారనుంది. దీంతో పాత కంట్రోల్  రూమ్  ను పూర్తి స్థాయిలో సీసీఎస్, డిటెక్టివ్  డిపార్ట్ మెంట్ లతో పాటు సెంట్రల్ జోన్ ఆఫీస్ కి అప్పగిస్తారు. ప్రస్తుతం పాతబస్తీలో ఉన్నట్లే బషీర్  బాగ్  లోనూ కమిషనర్  కోసం ఓ ఆఫీస్ ఉండనుంది.

ఏడేళ్లుగా నిర్మాణం

ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12 సెంటర్ ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఐదు టవర్లున్న  సెంటర్ లో 6.42లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. భవనం మొత్తం ఎత్తు 83.5మీటర్లు కాగా... టవర్‌ ‘A’లో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఉంటుంది. ఇంకో విషయమేమిటంటే శంకుస్థాపన జరిగిన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి  రానుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో రూ.585 కోట్లతో ఈ సెంటర్ ను నిర్మించింది సర్కార్. 2015 నవంబర్ 22 న సెంటర్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ముందు రూ.350 కోట్ల అంచనా వ్యయంతో 2018 చివరి లోపు ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐతే ప్రాజెక్ట్ ఆలస్యం కావటంతో... మరో రూ.200 కోట్లను కలిపి మొత్తం రూ.550 కోట్లను ఈ సెంటర్ వెచ్చించారు. ఇందులో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ కు మరో రూ.35 కోట్లను  సర్కార్ కేటాయించడం చెప్పుకోదగిన విషయం.