
గ్రేటర్ హైదరాబాద్ స్పీడ్ లైఫ్ లో స్పీడ్ బ్రేకర్ లు కూడా ఒక సమస్యగా మారినాయి. ప్రమాదాల నివారణ, వేగ నియంత్రణ కోసం స్పీడ్ బ్రేకర్లు అవసరమే. అయితే, అవసరం లేని, అనుమతులు లేని స్పీడ్ బ్రేకర్లు నగరంలో విచ్చలవిడిగా ఉన్నాయి. అవి ప్రయాణికుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఈ మధ్య సిటీ ఇన్నర్ రోడ్లలో వంద, రెండు వందల మీటర్ల దూరంలోనే నాలుగు స్పీడ్ బ్రేకర్లు ఉంటున్నాయి.
బస్తీలలోనైతే, దాదాపు నాలుగు ఇండ్లు దాటితే ఓ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. భద్రత, స్పీడ్ నియంత్రణ కోసం కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు తప్పనిసరే కానీ అవసరం లేని చోట కూడా అడ్డు అదుపు లేకుండా నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలకు కారణంగా మారుతుండటం, వాహనాలు దెబ్బతినడం, నడిపే వ్యక్తులకు కుదుపులతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి ఎత్తైన స్పీడ్ బ్రేకర్లు వలన సిటీలో రెగ్యులర్‌గా ప్రయాణం చేసే వాహనదారులు ప్రజలలో కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు పెరిగి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఆయా చోట్ల స్పీడ్ బ్రేకర్ ఉందన్న విషయం వాహనదారునికి అర్థం కావు. దీంతో స్పీడ్ బ్రేకర్లు సడన్ బ్రేక్లాగా మారిపోతున్నాయి.
జీబ్రా స్పీడ్ బ్రేకర్లు మరొక పరేషానీ
గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీల రోడ్లపై జీబ్రా స్పీడ్ బ్రేకర్లు ఐదు నుంచి పది లైన్లతో నిర్మిస్తున్నారు. వీటిని ఒకలైన్ ఒక సెంటీమీటర్ ఎత్తులో నిర్మించవలసి ఉంటుంది. కానీ, రెండు మూడు ఇంచుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. దీనివలన వెహికల్స్. కుదుపులకు గురి అయ్యి వాహన దారులకు చుక్కలు కనబడుతున్నాయి. వాహనాలు తొందరగా రిపేరుకు వస్తున్నాయి. వాహనదారుని ఒళ్ళు హూనం అవుతోంది అంటే అతిశయోక్తి కాదు. ప్రతి రోజు సిటీలో వెహికల్ పై ప్రయాణం చేసే నగరజీవి ఈ పరిస్థితి రోజూ ఎదుర్కొంటూ ఉంటారు. ఈ జీబ్రా లైన్స్ స్పీడ్ బ్రేకర్స్ కారణంగా వెహికల్‌ను ప్రతి నెలా రిపేర్లు చేయించవలసి వస్తున్నది.
అక్రమ స్పీడ్ బ్రేకర్ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
అనుమతిలేని, అక్రమ స్పీడ్ బ్రేకర్లను జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెంటనే తొలగించాలి. అలాగే అనుమతి ఉన్న స్పీడ్ బ్రేకర్లకు రేడియం కలర్వేయాలి. వాహనదారులు స్పీడ్ బ్రేకర్‌ను గుర్తు పట్టాలంటే వాటికి రేడియం కలర్ వేయడం తప్పనిసరి. అక్రమంగా స్పీడ్ బ్రేకర్స్ నిర్మించేవారిని గుర్తించి వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. భారీ జరిమానాలూ విధించాలి. లేదంటే ఈ విచ్చలవిడి స్పీడ్బ్రేకర్లతో వాహనదారులకు ప్రమాదాలు, రోడ్లు పాడైపోవడం షరామామూలుగానే మిగిలిపోతుంది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ అక్రమ స్పీడ్‌బ్రేకర్ల సమస్య నగర ప్రజల ప్రయాణాలకు పెద్ద సంకటంగా మారిందని గుర్తించాల్సిన అవసరం ఉంది. వెంటనే, వాటి తొలగింపుపై చర్యలు తీసుకోవాలి. అక్రమ స్పీడ్ బ్రేకర్లు నిర్మించేవారిపై ఎప్పటికప్పడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
అక్రమ స్పీడ్ బ్రేకర్లు కోకొల్లలు
గ్రేటర్ హైదరాబాదులో చాలావరకు అధికారిక స్పీడ్ బ్రేకర్లు సంబంధిత డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినప్పటికీ.. అంతకన్నా ఎక్కువగా అనేక చోట్ల ముఖ్యంగా నగరంలోని ఇన్నర్ రోడ్లు, బస్తీరోడ్లు, కాలనీల రోడ్లలో ఏర్పాటైన అనధికారిక స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. రోడ్లపై అనుమతి లేకుండా, తమకు అనుకూలత కోసం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నగరంలో ప్రతి కాలనీలో అది కామన్ అయిపోయింది. అవసరంలేని చోట్ల కూడా వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు చాలా అసౌకర్యాలను కలిగిస్తున్నాయి. ట్రాఫిక్ లేని చోట్ల కూడా కొందరి సౌలభ్యం కోసంపెద్ద పెద్దగా అక్రమంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రి పూట ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
సామల శ్రీనివాస్