ఎయిర్​పోర్ట్ మెట్రో పనులు స్పీడప్

ఎయిర్​పోర్ట్ మెట్రో పనులు స్పీడప్

హైదరాబాద్, వెలుగు: ఎయిర్‌‌పోర్ట్ మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా అలైన్‌‌మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ, ఇతర పనులు తొందరగా చేసేందుకు రెండు సర్వే  టీమ్స్​ను ఏర్పాటు చేసినట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో పిల్లర్లు, వయా డక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత ఉండాలనే విషయంలో ఈ డేటా కీలకమవుతుందని అన్నారు. ఆదివారం రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు ఉన్న ఎయిర్​పోర్ట్ మెట్రో మార్గాన్ని హెచ్ఏఎంఎల్ సీనియర్ ఇంజనీర్ల టీమ్​తో కలిసి ఆయన పరిశీలించారు. ఇంజనీర్లకు, సర్వే టీమ్స్​కు ఆదేశాలిచ్చారు.

అనంతరం ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్ల నిర్మాణం మెయిన్ రోడ్ జంక్షన్లకు దగ్గరగా ఉండాలని సూచించారు.  ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ ప్యాసింజర్లకు మాత్రమే కాకుండా స్థానికులు, శివార్లలో ఉండే తక్కువ ఆదాయ వర్గాలకు ఉపయోగపడేలా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ప్యాసింజర్లు రాయదుర్గం నుంచి తాము పనిచేసే ప్రాంతాలకు 20 నిమిషాల్లో చేరుకునేలా ఈ కారిడార్​ను డిజైన్ చేయాలన్నారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్యాసింజర్ల వెహికల్స్ పార్కింగ్ ఏరియా కోసం సూచించాలని తెలిపారు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌‌కు ఆనుకుని మెట్రో పిల్లర్ల నిర్మాణం తర్వాత, ట్రాఫిక్​కు ఏమాత్రం అంతరాయం రాకుండా చూడాలని ఇంజనీర్లకు సూచించారు. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్‌‌ను ప్లాన్ చేసేటప్పుడు, ఇదే మార్గంలోనే భవిష్యత్తులో  నిర్మించనున్న బీహెచ్ఈఎల్– - లక్డీకపూల్ మెట్రో కారిడార్ అవసరాలపై కూడా దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఆయన వెంట హెచ్ఏఎంఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ డీవీఎస్ రాజు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ మోహన్, జీఎంలు విష్ణువర్ధన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, ఇతర సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు.