స్పీడందుకున్న రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డుల మంజూరు..జోగులాంబ గద్వాల జిల్లాకు 35,335 శాంక్షన్

స్పీడందుకున్న రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డుల మంజూరు..జోగులాంబ గద్వాల జిల్లాకు 35,335 శాంక్షన్
  • ఇప్పటికే 20,075 వేల రేషన్ కార్డులు పంపిణీ
  • సన్నబియ్యం, సంక్షేమ పథకాలు వస్తాయని లబ్ధిదారుల సంబురం

గద్వాల, వెలుగు : ఏండ్లుగా ఎదురుచూస్తున్న పేదలు ఎట్టకేలకు రేషన్​కార్డులు అందడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పదేండ్లుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేదు. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. కొత్త కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు పాత రేషన్ కార్డులో పేర్ల తొలగింపు, చేర్పులకు సంబంధించిన పనులన్నీ ఎప్పటికప్పుడు కంప్లీట్​ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 35,335 రేషన్ కార్డులు మంజూరు చేయగా, 20,075 రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 15,260 రేషన్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది.

11 ఏండ్ల నుంచి నిరీక్షణ..

రేషన్ కార్డులు లేక పేద ప్రజలకు బియ్యం అందని పరిస్థితి నెలకొంది. 11 ఏండ్ల నుంచి పెళ్లి చేసుకున్న వారితో పాటు పిల్లల పేర్లు రేషన్ కార్డులో నమోదు కాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. రేషన్ బియ్యం అందక మార్కెట్లో బియ్యం కొనుక్కోవాల్సి వచ్చేది. కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు ఇస్తుండడంతో ఆనందం వెల్లివిరుస్తోంది. రేషన్ కార్డులు రావడం, సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వేగంగా ప్రాసెస్..

రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్  ప్రభుత్వం వేగవంతం చేసింది. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కార్డులు అందజేస్తోంది. దరఖాస్తు చేసుకున్న వెంటనే వెరిఫికేషన్  చేసి కార్డులు మంజూరు చేస్తున్నారు. కార్డులో పేర్ల చేర్పులు, మార్పులను పెండింగ్​ పెట్టకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్​ చేస్తున్నారు. లబ్ధిదారులు వారం, పది రోజుల్లోనే సంబంధిత అధికారులు కార్డులు జారీ చేస్తున్నారు.

పండుగ వాతావరణంలో పంపిణీ..

రేషన్ కార్డులు, వడ్డీ మాఫీ, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమాలను జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి మహిళలందరినీ అక్కడికి తరలించి రేషన్ కార్డులు, రుణాలు, వడ్డీ రాయితీ చెక్కులను అందిస్తున్నారు.

త్వరలోనే కార్డులన్నీ పంపిణీ చేస్తం..

రేషన్ కార్డుల అప్లికేషన్లు పెండింగ్ లో పెట్టకుండా వేగంగా క్లియర్  చేస్తున్నాం. ఇప్పటికే సగానికి పైగా పంపిణీ చేశాం. మిగిలిన రేషన్ కార్డులను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తాం.-  స్వామి కుమార్, డీఎస్ వో, గద్వాల