స్పైస్ జెట్ పై సైబర్ దాడి.. ప్రయాణికుల అవస్థలు

స్పైస్ జెట్ పై సైబర్ దాడి.. ప్రయాణికుల అవస్థలు

విమానయాన సంస్థ స్పైస్ జెట్ పై మంగళవారం రాత్రి  సైబర్ దాడి జరిగింది. ఆ కంపెనీ ఐటీ విభాగం వెంటనే స్పందించి, సైబర్ దాడి వల్ల ఏర్పడిన లోపాలను సరిదిద్దింది. అయితే ఈ దాడి ప్రభావంతో బుధవారం వందలాది స్పైస్ జెట్ విమాన సర్వీసులపై పడింది. ఢిల్లీ, జైపూర్, కాన్పూర్, శ్రీనగర్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు స్పైస్ జెట్ విమానాల్లో ఎక్కి కూర్చున్నా.. గంటల తరబడి అవి కదల్లేదు. దీనిపై పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారు. స్పైస్ జెట్ విమాన సర్వీసుల్లో జాప్యం కలగడానికి గల కారణానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వకపోవడం దారుణమంటూ కొందరు కామెంట్లు పెట్టారు.

ప్రయాణికుల ఆగ్రహం..

ఢిల్లీ నుంచి ధర్మశాలకు వెళ్లే స్పైస్ జెట్ విమానం (ఎస్జీ 2345).. ప్రయాణికులు ఎక్కి కూర్చున్న మూడు గంటల 45 నిమిషాల తర్వాత  తాపీగా కదలింది. ‘ఈ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసి ఉన్నా బాగుండేది. ఇలా విమానంలో కూర్చోపెట్టి గంటల తరబడి వెయిట్ చేయించడం సరికాదు’ అని ఓ నెటిజన్ ట్విటర్ లో వ్యాఖ్యానించాడు. పశ్చిమ బెంగాల్ లోని బగ్ డోగ్రా నగరం నుంచి చెన్నై కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానాన్ని అకస్మాత్తుగా రద్దు చేశారు. ‘‘విమాన సర్వీసును అకస్మాత్తుగా రద్దు చేయడంపై వివరణ కోరుదామని నేను ప్రయత్నించాను. స్పైస్ జెట్ కస్టమర్ కేర్ నంబర్ పనిచేయలేదు. ఆ కంపెనీ వెబ్ సైట్ కూడా తెరుచుకోలేదు’’ అని బగ్ డోగ్రా నుంచి చెన్నైకు బయలుదేరాల్సిన అర్ణబ్ పాల్ అనే ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. కాన్పూర్, జైపూర్ విమానాశ్రయాల్లో స్పైస్ జెట్ సర్వీసులు నిర్ణీత సమయం కంటే నాలుగైదు గంటలు ఆలస్యంగా గమ్యస్థానాలకు బయలుదేరాయి.  

మరిన్ని వార్తలు..

ఆ ఊరి అబ్బాయిలకు పెళ్లి కష్టాలు

గుంటూరులోని జిన్నా టవర్ నేపథ్యమిది