గుంటూరులోని జిన్నా టవర్ నేపథ్యమిది

గుంటూరులోని జిన్నా టవర్ నేపథ్యమిది

జిన్నా టవర్ సెంటర్..పేరులో జిన్నా ఉందని, అదెక్కడో పాకిస్తాన్ లో ఉందని భావించకండి. మన భారతదేశంలోనే..  పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనే.. గుంటూరు నగరం నడిబొడ్డునే ‘జిన్నా టవర్’ ఉంది. గుంటూరులోని ముస్లింల వ్యాపార సముదాయానికి లాల్ బహదూర్ శాస్త్రి  పేరు ఉండగా, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే  ప్రాంతంలో జిన్నా టవర్ కేంద్రీకృతమై ఉండటమే ప్రధాన ప్రత్యేకత. మరి పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా పేరిట గుంటూరు లో టవర్ ఎందుకు నిర్మించారు ? అనే సందేహం మీ మదిలో ఉదయించి ఉంటుంది. దీనికి సమాధానం దొరకాలంటే మనం టైం మిషన్ లో ప్రయాణించి 1942వ సంవత్సరానికి వెళ్లాలి. క్విట్ ఇండియా  ఉద్యమం  ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయం అది. అప్పట్లో గుంటూరు కేంద్రంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో దివంగత టీడీపీ సీనియర్ నేత లాల్ బాషా తాత ఎస్.ఎం.లాల్ జాన్ బాషా కీలక పాత్ర పోషించారు. నాడు ఆయన గుంటూరు ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీకి ఆయన రెండుసార్లు ప్రాతినిధ్యం కూడా వహించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేసే లక్ష్యంతో గుంటూరులో భారీ సభను నిర్వహించాలని ఎస్.ఎం.లాల్ జాన్ బాషా  భావించారు. స్వయంగా జిన్నాను ఆహ్వానించేందుకు కొందరు ప్రతినిధులతో కలిసి గుంటూరు నుంచి ముంబైకి వెళ్లారు. సభకు వచ్చేందుకు జిన్నా అంగీకారం తెలపడంతో.. ఆయన రాక కోసం గుంటూరులో భారీ ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలోనే జిన్నా గౌరవార్ధం..ఆయన పేరిట ప్రత్యేక టవర్ ను నిర్మించారని లాల్ జాన్ బాషా కుటుంబీకులు చెబుతున్నారు. అయితే తాను గుంటూరుకు రాలేకపోతున్నానని చివరి నిమిషంలో జిన్నా సమాచారమిచ్చారు. జిన్నా స్థానంలో ఆయన సన్నిహితుడు జుదా లియాఖత్ అలీఖాన్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇక 1942 నుంచి 1945 మధ్యకాలంలో ఈ టవర్ నిర్మాణ పనులు జరిగాయి. మొదటి నుంచే దీని నిర్వహణ గుంటూరు మునిసిపాలిటీ పరిధిలో ఉంది. 

వివాదం ఏమిటి ? 

గుంటూరు నగరంలో ప్రధాన వ్యాపార కూడలిగా ఉన్న జిన్నా టవర్ సెంటర్  పేరును మార్చాలనే డిమాండ్ గతంలో పలుమార్లు ముందుకొచ్చింది. మన దేశ విభజనకు కారకుడైన పాకిస్తానీ నేత పేరును కొనసాగించకూడదని కొందరు వాదిస్తున్నారు. దీనిపై కొన్నేళ్ల క్రితం గుంటూరు మునిసిపాలిటీలో తీర్మానం చేసేందుకు సిద్ధమైనా,పలువురు అభ్యంతరాలు లేవనెత్తడంతో వెనక్కి తగ్గారు. కార్గిల్ యుద్ధం వంటి కొన్ని సందర్భాల్లోనూ కొందరు భావోద్వేగాలతో జిన్నా టవర్ విషయంలో అభ్యంతరాలు పెట్టారు. ‘‘జిన్నా కూడా దేశ విభజనకు ముందు.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రముఖుడే కాబట్టి.. ఆయన పేరు నేటికీ నిలుస్తోంది’’ అని  గుంటూరుకు చెందిన కొందరు ముస్లిం జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు.. 

ఎఫ్ బీ, ఇన్ స్టా లో 3డీ అవతార్ లు

సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్