ఆధ్యాత్మికం: బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞాని ఎవరు ? ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే

ఆధ్యాత్మికం: బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞాని ఎవరు ? ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే

బృహదారణ్యకోపనిషత్తులో ఆసక్తిగొలిపే ఆధ్యాత్మిక సంవాదాలు ఎన్నో ఉన్నాయి! వాటిలో ఒకటి గార్గ్యుడు – అజాత శత్రుల సంవాదము. 'బ్రహ్మ జ్ఞానం' అంటే ఏమిటి? తత్వాన్ని ఎవరికి నేర్పాలి? ఎవరు నేర్పాలో చక్కగా చెబుతుంది ఈ సంవాదం....

ఒకప్పుడు గార్డ్యుడనే బ్రాహ్మణుడు కాశీపట్టణ రాజు అజాత శత్రు వద్దకు వెళ్ళి.. 'ఓ రాజా! నీకు బ్రహ్మోపదేశం చేస్తాను' అన్నాడు. జిజ్ఞాసి అయిన అజాతశత్రు కూడా సరేనంటూ బ్రహ్మోపదేశం ఆరంభించమని శిష్యభావంతో గార్గ్యుని ముందు కూర్చున్నాడు.

బ్రహ్మ గార్గ్యుడు ఆరంభిస్తూ.. ఈ సృష్టిలోని భూతచయములన్నింటిలో శ్రేష్టునిగా సూర్యుని ప్రతిపాదిస్తాడు. “నేనతనినే ధ్యానిస్తాను. నీవు కూడా 'ఆదిత్యో బ్రహ్మోహమస్మి' అంటూ సూర్యుడ్ని ధ్యానించు. అదే బ్రహ్మము” అంటాడు. చెప్పినట్టే రాజు అన్నాడు. ఆ తర్వాత.. 'అది నాకు తెలుసు. సూర్యుడు నిస్సందేహంగా గొప్పవాడే, కానీ, సూర్య భగవానుడి ఆవిర్భావానికి కారణమైనది ఏదో ఒకటి ఉన్నది కదా. అలాంటప్పుడు సూర్యుడు బ్రహ్మము ఎలా అవుతాడు? ఉన్నతోన్నతమైన బ్రహ్మజ్ఞానాన్ని సూర్యుడిని ధ్యానించడం ద్వారా ఎలా పొందగలుగుతాము?' అని రాజు అజాత శత్రుని ప్రశ్నించాడు.  అప్పుడు గార్గ్యుడు చంద్రుని శ్రేష్టునిగా చెప్పాడు. రాజు కాదన్నాడు. ఇలా వరసగా విద్యుత్తు, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, అద్దం, శబ్దం, దిక్కులు, నీడ శ్రేష్టమైనవిగా గార్గ్యుడు ప్రతిపాదించాడు. అవన్నీ కాదంటూ రాజు నిరూపణ చేశాడు.

మిడిమిడి జ్ఞానం
ఆకారం కలిగి, నాశనమయ్యే స్వభావం ఉండి, పంచేంద్రియాల ద్వారా గుర్తించగలిగే వాటిని ధ్యానిస్తే శాశ్వతమైన బ్రహ్మతత్వాన్ని సాధించడం సాధ్యపడదని అజాతశత్రు అంటాడు. వెంటనే గార్గ్యుడు స్పందిస్తూ.. మనసు, బుద్ధి, హృదయంతో ధ్యానించాలని చెబుతాడు. 'వాటిని ధ్యానించడం వల్ల మనో నిగ్రహం, బుద్ధి కుశలత, సంయమనం లభిస్తుంది. కానీ, బ్రహ్మతత్వాన్ని సాధించలేము కదా, ఓ మహాత్మా! మీకు తెలిసింది ఇంతేనా? ఇంకా ఏమైనా ఉందా?' అని అడిగాడు రాజు. 'ఏమీ లేదు' అన్నాడు గార్గ్యుడు. 'ఇంతే తెలిస్తే తెలుసుకోవలసింది ఎప్పటికీ సంపూర్ణమైన సత్యం కాదని, అంతిమసత్యం కాజాలదని గార్గ్యుడితో అజాతశత్రు అంటాడు. అప్పుడు గార్గ్యుడు 'నీకు శిష్యుడిగా ఉంటాను. నాకు దీక్ష ఇవ్వమని రాజుని వేడుకుంటాడు.


 సత్యానికే సత్యం
రాజు అజాత శత్రు శిష్యుడిగా ఉంటానన్న గార్గ్యుడిని వెంటబెట్టుకుని “నాకు తెలిసిన దానిని సోదాహరణంగా ఉపదేశిస్తాను' అంటూ అంతఃపురంలోకి తీసుకుపోయిండు. అంతఃపురంలో నిద్రిస్తున్న ఒక పురుషుడి వద్దకు పోయి, అతడిని నిద్ర లేపేందుకు ఆజాత శత్రు బిగ్గరగా పేరుపెట్టి పిలుస్తాడు. అతడు లేవడు. రాజు అతడిని తట్టి లేపితే మేల్కొంటాడు. ఆ తర్వాత రాజు ఇలా అన్నాడు.. ‘ఆర్యా! గమనించారా? గాఢ నిద్రలో తానెక్కడ ఉన్నాడో? ఏమి చేస్తున్నాడో? ఏమవుతుందో? కొంచె కూడా అతనికి తెలియదు! కాకపోతే గాఢ నిద్రలో కూడా అతని శ్వాసాది క్రియలన్నీ సరిగానే పనిచేస్తున్నాయి. నిద్రలో ఉన్నప్పుడు అతనికి ప్రాణం ఉంది. కానీ, నా పిలుపుకు స్పందన లేదు. అంటే ప్రాణం గాఢ నిద్రలో ఉంది. కాబట్టి ప్రాణం బహ్మం కాదు. శారీరక అంగాలు కూడా నిద్రావస్థలో ఉన్నప్పుడు స్పందించలేదు. కాబట్టి అవి కూడా బ్రహ్మం కాదు. మరి గాఢ నిద్రలో ఆత్మ ఎక్కడ ఉంటుంది?

నిద్రావస్థలో జీవాత్మ పరమాత్మతో అనుసంధానమై ఉంటుంది? ఆత్మ భౌతిక అనుబంధాన్ని పెట్టుకోదు. అందుకే, ఇంద్రియాలు, మనసు, బుద్ధి నిద్రలో ఉన్నప్పుడు సహజమైన స్పందనలు లేకుండా ఉంటాయి. ఈ స్థితి తాత్కాలికమైనది. జీవుడు మేల్కొనగానే సాధారణ దినచర్యలోకి మారిపోతాడు. పిండగతమైన ఆత్మయే సత్యం. ఈ ఆత్మే బ్రహ్మాండమంతా వెలుగుతూ ఉంటుంది. అందుకే దీనిని ‘సత్యానికే సత్యం' అంటారని అజాత శత్రు ఉపదేశిస్తాడు.

పాక్షిక సత్యం చెప్పే సత్యం?
మనిషిలో చైతన్యం.. మెలకువ (జాగరూకత), కల (స్వప్నం), సుషుప్తి (గాఢ నిద్ర) అనే మూడు రకాల అవస్థలలో ఉంటుంది. నిజానికి మనం చెప్పుకునే "ప్రాణం, చూడడం, మాట్లాడడం, ఆలోచించడం, వినడం లాంటివి అన్నీ సత్యాలే” కానీ, ఇవన్నీ పాక్షిక సత్యాలు. పాక్షిక సత్యాలు మనం ఏ స్థితిలో ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటాయి. సత్యాలలోకెల్లా సత్యమైనది ఆత్మే!

 గార్గ్యుడు - అజాత శత్రుల సంవాదం తత్వం ఉపదేశించడానికి ఎవరైనా అర్హులేనని చెబుతుంది. దానిని పొందేందుకు జిజ్ఞాస ముఖ్యమని చెబుతుంది. జ్ఞానాన్ని ఎవరి నుంచైనా పొందవచ్చని తెలియజేస్తుంది. బ్రహ్మ జ్ఞానం అంటే అక్షరాల జ్ఞానం కాదు. పుస్తక జ్ఞానం కాదు. ఆచరణాత్మకమై, జిజ్ఞాసతో కూడి, అహంలేని, నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నవారికి బ్రహ్మజ్ఞానం బోధించాలి.

- పాలకుర్తి రామమూర్తి