షెడ్యూల్ టోర్నీల్లో ఆడేందుకు అనుతివ్వండి

షెడ్యూల్ టోర్నీల్లో ఆడేందుకు అనుతివ్వండి

భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై ఫిఫా నిషేధంతో  AFC ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఉజ్బెకిస్థాన్ కు వెళ్లిన గోకులం కేరళ మహిళల జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఫిఫా నిషేధంతో ఈ టోర్నీలో గోకులం ఉమెన్స్ టీమ్ ఆడేది అనుమానంగా మారింది. అయితే AIFFపై నిషేధం ఉన్నప్పటికీ షెడ్యూల్ ప్రకారం టోర్నమెంట్‌లలో పాల్గొనేందుకు భారతీయ క్లబ్‌లు  గోకులం కేరళ FC, ATK మోహన్ బగాన్‌లను అనుమతించాలని FIFA, ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ ను భారత క్రీడా మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. వియత్నాం, సింగపూర్‌తో భారత జట్టు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు, AFC కప్‌ ఇంటర్‌ జోనల్‌ సెమీఫైనల్స్‌లో  మోహన్‌ బగాన్‌ మ్యాచ్‌ లకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. 

FIFA, AFCకి  మెయిల్..
AIFFపై FIFA సస్పెన్షన్ ప్రకటించినప్పుడు గోకులం కేరళ టీమ్ ఉజ్బెకిస్తాన్‌లో FIFA , AFCకి భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఈమెయిల్ ద్వారా తెలిపింది. యువ ఆటగాళ్ల ప్రయోజనాల దృష్ట్యా AFC ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్ లో ఆడేందుకు జట్టును అనుమతించాలని ఫిఫా,AFCలను అభ్యర్థించిందని కేంద్ర క్రీడా శాఖ ప్రకటన విడుదల చేసింది. ఉజ్బెకిస్తాన్‌లోని గోకులం మహిళా జట్టుకు అన్ని విధాలుగా సహాయం అందించడానికి ఉజ్బెకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గోకులం టీమ్ మేనేజ్‌మెంట్‌తో మంత్రిత్వ శాఖ నిరంతరం టచ్‌లో ఉందని పేర్కొంది. నిషేధం వార్తల తర్వాత  గోకులం కేరళ మహిళా జట్టు అధ్యక్షుడు VC ప్రవీణ్ క్రీడా తమతో  మాట్లాడారని తెలిపింది. 

మోడీకి విన్నపం..
AIFFపై ఫిఫా నిషేధాన్ని తెలుసుకున్న గోకులం  మహిళా జట్టు ఏఎఫ్‌సీలో ఆడేలా చొరవ తీసుకోవాలని  ట్విటర్ వేదికగా  ప్రధాని నరేంద్ర మోదీ,  క్రీడాశాఖ మంత్రి అనురాగ్ థాకూర్ లకు విన్నవించారు.  23 మంది మహిళా ప్లేయర్లు  తష్కెంట్‌లో నిస్సహాయ స్థితిలో ఉన్నారని వాపోయారు. ఈ నెల  16న కోజికోడ్ నుంచి ఉబ్జెకిస్తాన్‌లోని తష్కెంట్ చేరామని.. ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా నిషేధం విధించిందనే వార్తలు విమానం దిగిన తర్వాత తెలిశాయన్నారు. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు భారత క్లబ్‌ జట్లు అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనడానికి వీలు లేదన్నారు. కాబట్టి పీఎం, స్పోర్ట్స్ మినిస్టర్  జోక్యం చేసుకుని ఫిఫా నిషేధం ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

AIFFకు ఫిఫా షాక్..
ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు ఫిఫా షాకిచ్చింది. భారత ఫుట్బాల్ సమాఖ్యను సస్పెండ్ చేస్తున్నట్లు ఫిఫా ప్రకటించింది. భారత ఫుట్బాల్ ఫెడరేషన్ లో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉన్నట్లు ఫిఫా తేల్చింది. ఇలాంటి  అసోసియేషన్లను  తాము గుర్తించలేమని స్ఫష్టం చేసింది. ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిఫా వెల్లడించింది. ఫిఫా చట్టాలను ఉల్లఘించినందుకే ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పై చర్యలు తీసుకున్నట్లు వివరించింది. భారత ఫుట్బాల్ సమాఖ్య సస్పెన్షన్పై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం చేసింది. భారత ఫుట్బాల్ ఫెడరేషన్కు పూర్తి స్థాయి కార్యవర్గం లేదు. కేవలం ముగ్గురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యకలాపాలను సాగిస్తోంది. దీంతో ఫిఫాలో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువైంది. ఈ విషయంపై భారత్ను ఫిఫా పలుమార్లు హెచ్చరించినా భారత సమాఖ్య పట్టించుకోలేదు. దీంతో ఫిఫా నిషేధం విధించింది. 

17 మహిళల వరల్డ్‌క్‌పపై అనిశ్చితి 
ఫిఫా నిర్ణయంతో అండర్‌-17 మహిళల వరల్డ్‌ కప్ మరోదేశానికి తరలివెళ్లనుంది. నిషేధం కారణంగా భారత్‌లో ఈ ఏడాది అక్టోబరు 11 నుంచి 30 వరకు జరగాల్సిన ఈ మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని ఫిఫా తేల్చింది. అయితే టోర్నీ ఎప్పుడు.. ఎక్కడ జరపాలనే నిర్ణయం త్వరలోనే తీసుకుంటామంది.