సర్కారు డిగ్రీ కాలేజీల్లోనూ స్పాట్ అడ్మిషన్లు..త్వరలోనే షెడ్యూల్  రిలీజ్ : దోస్త్  కన్వీనర్  బాలకిష్టారెడ్డి

సర్కారు డిగ్రీ కాలేజీల్లోనూ స్పాట్ అడ్మిషన్లు..త్వరలోనే షెడ్యూల్  రిలీజ్ : దోస్త్  కన్వీనర్  బాలకిష్టారెడ్డి
  • ఎట్టకేలకు విద్యా శాఖ నిర్ణయం

 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో కూడా స్పాట్ అడ్మిషన్లకు సర్కారు పర్మిషన్  ఇచ్చింది. త్వరలోనే షెడ్యూల్  రిలీజ్  చేస్తామని దోస్త్  కన్వీనర్  బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యా శాఖ కమిషనర్  శ్రీదేవసేన ప్రకటించారు. ఇదే అంశంపై గత నెల 30న ‘సర్కారు డిగ్రీ కాలేజీల్లో నో స్పాట్ అడ్మిషన్స్’ హెడ్డింగ్​తో ‘వెలుగు’ లో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారుల్లో చలనం మొదలైంది. మరోపక్క కొన్నేండ్లుగా కేవలం ప్రైవేటు కాలేజీలకు మాత్రమే స్పాట్  అడ్మిషన్లు ఇవ్వడంపై పలు డిగ్రీ లెక్చరర్ల సంఘాలు స్పందించాయి.

సర్కారు కాలేజీల్లోనూ స్పాట్  అడ్మిషన్లు నిర్వహించాలని విన్నవించాయి. గురువారం సచివాలయంలో దోస్త్  స్పాట్ అడ్మిషన్లపై ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రైవేటు కాలేజీలతో పాటు సర్కారు కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీల్లోనూ స్పాట్  అడ్మిషన్లు నిర్వహించుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ కు అర్హులు కాదని ప్రకటించారు. త్వరలోనే షెడ్యూల్  రిలీజ్ చేస్తామని తెలిపారు.

అయితే, విద్యార్థులు అప్​డేట్  కోసం దోస్త్ వెబ్ సైట్ https://dost.cgg.gov.in ను రెగ్యులర్​గా చూడాలని సూచించారు. సర్కారు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని  119 ప్రభుత్వ, 37 అటానమస్, యూనివర్సిటీ కాలేజీల్లో చేరేందుకు అవకాశం లభించినట్లయింది. కాగా, ఈ నెల 13, 14వ తేదీల్లో ప్రైవేటు కాలేజీల్లో స్పాట్  అడ్మిషన్లకు అవకాశం ఇచ్చారు. దీంతో మిగిలిపోయిన చాలా మంది అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం  సర్కారు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇచ్చినా.. పెద్దగా అడ్మిషన్లు రాకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. కాకపోతే వచ్చే ఏడాది నుంచి దోస్త్  స్పాట్ తో ఉపయోగం ఉంటుందని పేర్కొంటున్నారు.