పాత ఫొటోలతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు : వివేక్​ వెంకటస్వామి

పాత ఫొటోలతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు  : వివేక్​ వెంకటస్వామి

లిక్కర్​ స్కాం నుంచి కవితను కాపాడుకునేందుకు సీఎం డ్రామా ఆడుతున్నరు: వివేక్ ​వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీ స్వామి సీఎం కేసీఆర్ కోవర్ట్​అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి అన్నారు. పాత ఫొటోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో వివేక్ మాట్లాడుతూ.. సింహయాజీ, అతని మిత్రులతో కేసీఆరే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా ఆడించినట్లు క్లియర్​గా అర్థమవుతోందని అన్నారు. ‘‘గతంలో స్వామిజీ నా ఇంటికి వచ్చి.. రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి పెరిగింది, కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్​ నుంచి బయటకు వస్తరు అని చెప్పారు. అప్పుడే అతను కేసీఆర్ కోవర్ట్ అని నాకు అర్థమైంది. 

ఆ తర్వాత అతనితో కమ్యూనికేషన్​కట్ చేశాను. చాలా సార్లు ఫోన్ చేసినా నేను పట్టించుకోలేదు” అని వివేక్ ​వివరించారు. ఆ డబ్బులు, స్వామీజీ, ఎమ్మెల్యేలు అన్ని కేసీఆర్ కుట్రలో భాగమేనని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన కూతురు కవితను కాపాడుకునేందుకు కేసీఆరే ఈ డ్రామా ఆడించారని అన్నారు. ఈ కేసులో స్వామీజీకి ప్రగతి భవన్​కు మధ్య ఉన్న కాల్ రికార్డులు బయటకు తీయాలని డిమాండ్ ​చేశారు. కేసులో నిందితుడు టీఆర్​ఎస్​ నేతలతో ఎందుకు కలిసి ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు.