- రక్తదానం చేసిన 600 మంది సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: సమాజ శ్రేయస్సులోనూ మేము సైతం అంటూ శ్రీచైతన్య విద్యాసంస్థలు మరోసారి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా శుక్రవారం నాగోల్ శ్రీచైతన్య మెట్రో క్యాంపస్లో విద్యాసంస్థలు, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దిల్సుఖ్నగర్ జోన్ పరిధిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్, కళాశాలలకు చెందిన 600 మందికి పైగా సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి మాట్లాడుతూ “41 ఏండ్ల క్రితం డాక్టర్ బీఎస్ రావు నాటిన చిన్న విద్యా విత్తనం.. నేడు మహావృక్షంగా ఎదిగి, ప్రపంచం గర్వించే మేధావులను అందించే స్థాయికి చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం వెనుక ఆయన అంకితభావం, దూరదృష్టితో పాటు శ్రీచైతన్య బోధన, బోధనేతర సిబ్బంది కృషి వెలకట్టలేనిది’’ అని అన్నారు. రక్తదానం చేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉప్పల్ జోన్ అడిషనల్ డీసీపీ ఎన్.వెంకట రమణ, ఏసీపీ వై.వెంకటరెడ్డి, ఎస్.హెచ్.ఓ వై.రామలింగారెడ్డి, సినీ నటుడు దిల్ రమేశ్, డీన్ జగదీశ్, శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ, స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సీమ బొమ్మినేని, ఈస్ట్ జోన్ ఏజీఎంలు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు
