
పటాన్చెరు పరిధి వెలిమల గ్రామంలో శ్రీలక్ష్మీఅనంత పద్మనాభస్వామి బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన స్వామివారి కల్యాణంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి చీఫ్‌గెస్ట్‌గా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెలిమల గ్రామానికీ, తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. వెలిమలకు ఎంతో రుణపడి ఉంటానని, తన ఇండస్ట్రియల్ కెరియర్ ఇక్కడి నుంచే మొదలైందని గుర్తుచేశారు. మొట్టమొదటగా విశాక ఇండస్ట్రీస్ ఇక్కడే స్టార్ట్ చేశామని, గ్రామస్తులు, సర్పంచ్ కంపెనీకి పూర్తిగా సహకరించారని తెలిపారు. ప్రస్తుతం విశాక కంపెనీలు పలు రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పారు. కంపెనీ స్థాపించినప్పుడు ఇక్కడ రోడ్డు కూడా సరిగా లేదని, కార్మికులు కష్టపడి పనిచేశారన్నారు. వెలిమలతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తమ కంపెనీకి సహకరిస్తున్నారని వివేక్ వెంకటస్వామి తెలిపారు.
-వెలుగు, హైదరాబాద్