సిరిసిల్ల టౌన్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీలక్ష్మీ నరసింహాస్వామి రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి రథంపై దర్శనమివ్వగా.. సాయంత్రం మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరాగా ఆప్రాంతమంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై స్వామిని దర్శించుకొని రథోత్సవాన్ని ప్రారంభించారు.
అంతకు ముందు ఉదయం ఆలయంలో హోమం, స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రథంపై కొలువుదీరిన స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్మల స్వరూప, లీడర్లు సంగీతం శ్రీనివాస్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.