SL vs AFG 2nd ODI: 10 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. పరువు పోగొట్టుకున్న ఆఫ్ఘనిస్తాన్

SL vs AFG 2nd ODI: 10 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. పరువు పోగొట్టుకున్న ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. బాగా ఆడుతున్నప్పుడు అనూహ్యంగా కుప్పకూలడం.. త్వరగా వికెట్లు పడినప్పుడు భారీ భాగస్వామ్యం నెలకొల్పడం ఆ జట్టుకు అలవాటే. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై గెలిచే మ్యాచ్ చేజార్చుకుని సెమీస్ అవకాశాలు కోల్పోయారు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. మహమ్మద్ నబీ, ఇబ్రహీం జద్రాన్ రెండు వందలకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి లంక బౌలర్లను వణికించారు. తాజాగా నిన్న (ఫిబ్రవరి 11) జరిగిన రెండో వన్డేలో ఊహించని విధంగా 10 పరుగుల వ్యవధిలోనే చివరి 8 వికెట్లను కోల్పోయింది. 

2 వికెట్లకు 143 పరుగుల తేడాతో పటిష్ట స్థితిలో నిలిచిన ఆఫ్గన్లు.. 153 పరుగులకు ఆలౌటైంది. కేవలం 29 బంతుల్లోనే 8 వికెట్లను కోల్పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రహ్మత్ షా మూడో వికెట్ రూపంలో ఔటైన తర్వాత  ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 20 నిమిషాల్లోనే ముగిసిపోయింది. హసరంగా స్పిన్ మాయాజాలానికి తోడు మధుశంక పేస్ ముందు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు నిలబడలేకపోయారు. ఇబ్రహీం జద్రాన్ (54),రహ్మత్ షా (63) హాఫ్ సెంచరీలు మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. పసికూన ట్యాగ్ తో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది.  

పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక 155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అసలంక 97 పరుగులు చేసి సెంచరీ మిస్ అయ్యాడు. కుశాల్ మెండిస్(61) సమర విక్రమే(52) లియాంగే(50) హాఫ్ సెంచరీలు చేశారు. లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 33.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. హసరంగా నాలుగు వికెట్లు, మధు శంక రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ తో శ్రీలంక 2-0 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకుంది.    

Also Read : మహారాష్ట్ర మాజీ CM కాంగ్రెస్ కు రాజీనామా.. త్వరలో బీజేపీ బాట

 

>