ODI World Cup 2023: టీమిండియాపై 55 పరుగులకే ఆలౌట్: క్రికెట్ బోర్డును రద్దు చేసిన శ్రీలంక క్రీడాశాఖ

ODI World Cup 2023: టీమిండియాపై 55 పరుగులకే ఆలౌట్: క్రికెట్ బోర్డును రద్దు చేసిన శ్రీలంక క్రీడాశాఖ

వరల్డ్ కప్ లో శ్రీలంక ఘోరంగా ఓడిపోతుంది. ఆడిన 7 మ్యాచ్ ల్లో రెండు విజయాలను మాత్రమే సొంతం చేసుకుంది. తొలి మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయిన లంక జట్టు నెదర్లాండ్స్  పై గెలిచి ఈ మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్ళి ఓటముల బాట పట్టింది. ఇంగ్లాండ్ పై విజయం మినహా ఈ టోర్నీలో శ్రీలంకకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ముఖ్యంగా భారత్ పై 55 పరుగులకే ఆలౌట్ కావడం ఆ జట్టు మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసింది. ఈ మ్యాచ్ లో కనీస ఆటతీరును ప్రదర్శించని లంక జట్టులో ఏకంగా 5 గురు ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. 

ఈ దారుణ ఓటములకు శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా లంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.భారత్ పై అవమానకర రీతిలో ఓడిపోవడమే దీనికి కారణం అని తెలుస్తుంది. దీంతో జట్టులో అవినీతి ఎక్కువగా ఉందని తక్షణమే మధ్యంతర బోర్డును ఏర్పాటు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జున రణతుంగను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు. ఈ ప్యానెల్ లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ సహా ఏడుగురు సభ్యులను నియమించారు.

శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘె క్రికెట్ బోర్డుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీలంక క్రికెట్ బోర్డ్ అవినీతితో నిండిపోయిందని..   బోర్డ్ ప్రెసిడెంట్ తో పాటు సభ్యులకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. వరల్డ్ కప్ టోర్నీలో జట్టు వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఘోర ఓటములతో బోర్డుపై విమర్శలు రావడంతో కార్యాలయంపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన కొలంబో పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది.