సరిగ్గా ఏడాది: శ్రీదేవి జ్ఞాపకాల్లో ప్రేమాంజలి

సరిగ్గా ఏడాది: శ్రీదేవి జ్ఞాపకాల్లో ప్రేమాంజలి

శ్రీదేవి నవ్వితే తేనె చుక్కలు రాలి పడినట్టుండేది. శ్రీదేవి మాట్లాడితే పూల రెక్కలు విచ్చుకున్నట్టుండేది. శ్రీదేవిని చూస్తే అతిలోక సౌందర్యమంతా పోత పోసినట్టుండేది. శ్రీదేవి మాటలో, నవ్వులో, ప్రతి కదలికలో అందమే తొణికిసలాడేది. ఆ అందం వెండితెరను ఎన్నో ఏళ్లపాటు ఏలింది. ఆ అపురూప సౌందర్యం ప్రతి ప్రేక్షకుడి మనసులో పీట వేసుకుని కూర్చుంది. ఆమె లేకపోయినా… అది చెక్కు చెదరదు. ఎన్నేళ్లు గడిచినా ఆ రూపం మదిని వీడి వెళ్లదు.

ఒకప్పుడు ఈ రోజును మనవాళ్లు ఏ కారణంగా గుర్తు పెట్టుకునేవారో తెలియదు. ఇప్పుడు మాత్రం ఒక దురదృష్టకరమైన రోజుగా గుర్తుపెట్టుకుంటున్నారు. తమ అభిమాన నటిని కర్కశంగా లాక్కె ళ్లిపోయిన క్రూరమైన రోజుగా ద్వేషిస్తున్నారు. సంవత్సరం క్రితం… సరిగ్గా ఇదే రోజు… శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. దుబాయ్‌ లోని బాత్ టబ్బులో శవమై తేలింది. అందరినీ విషాదంలో ముంచేసింది. ఇది జరిగి సంవత్సరమైనా ఆ బాధ ముల్లులా ప్రతి గుండెనీ గుచ్చుతూనే ఉంది. శ్రీదేవి ఇప్పటికీ బతికే ఉందేమో అన్న భ్రమలోకి దింపుతూనే ఉంది. శ్రీదేవి చనిపోవడమేంటి? ఆమెకు మరణం ఉంటుందా? ఈ ప్రశ్నకు జవాబు ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు ప్రేక్షకుడు. భారతీయ సినిమా చరిత్ర తిరగేస్తే లేడీ సూపర్ స్టార్ అన్న పదానికి మొదటి చిరునామా శ్రీదేవి. భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌‌‌‌ను దశాబ్దాల పాటు ఏలిన మహారాణి శ్రీదేవి.

అందమంటే ఆమెది. నటనంటే ఆమెది. అంతకన్నా గొప్ప నటీమణులు లేరని కాదు. అందరినీ మరిపించేంత గొప్పగా ఆమె నటించిందని. ఆమెకంటే అందగత్తెలు కనబడలేదని కాదు. అంతమందిలో ఆమె అందం ప్రత్యేకమైనదని. 1963, ఆగస్టు 13న ఎక్కడో శివకాశిలో పుట్టిన ఆమె మనకు దగ్గరవుతుందని ఏ తెలుగువాడూ ఊహించలేదు. తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని నటిగా నిరూపించుకున్న ఆమె… ఉత్తరాదిన టాప్ స్టార్ అయిపోతుందని వాళ్లూ ఊహించలేదు. దేశమంతా దేవతలా కొలిచే ఆమె… దీన స్థితిలో మరణిసుందని ఎవ్వరూ ఊహించలేదు. ఊహించనివి జరగడమే జీవితం అనడానికి శ్రీదేవి జీవితమే ఉదాహరణ. హీరోయిన్‌‌‌‌గా తెలుగులో ‘బంగారక్క’ శ్రీదేవి తొలిచిత్రం. కానీ ‘పదహారేళ్ల వయసు’తో పదికాలాల పాటు నిలిచిపోయే నటిగా ఉద్భవించింది. ‘ఎర్రగులాబీలు’ పూయించింది. ‘కార్తీకదీపం’ వెలిగించింది. ‘వేటగాడు’తో, ‘సర్దార్ పాపారాయుడు’తో ఆడి పాడింది. ‘ఆకలిరాజ్యం’లో తన పర్‌ ఫార్మెన్స్‌‌‌‌తో మనసులు నింపింది. ‘ప్రేమాభిషేకం’ చేయించుకుంది. ‘అనురాగ దేవత’గా అవతరించింది. ‘బొబ్బిలి పులి ’కి బాసటయ్యింది. ‘కోడెత్రాచు’ కోరలణిచింది. ‘అతిలోక సుందరి’గా ఆవిర్భవించింది. ‘క్షణక్షణం’ తెలుగువారి మదిలో మెదిలింది. వెండితెర ‘దేవత’గా నిలిచిపోయింది. ఏ పాత్ర చేసినా పాత్ర కనిపించాలి తప్ప నటి కనిపించకూడదంటారు. ఏ పాత్రలోనూ శ్రీదేవి కనిపించలేదు. కానీ శ్రీదేవి చేయడం వల్లే ప్రతి పాత్రా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఆమే నంబర్ వన్. దశాబ్దాల పాటు బాలీవుడ్లో ఆమే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఎన్టీఆర్, ఏఎన్నార్, అమితాబ్, రజనీకాంత్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో ఆమే. నాగార్జున, వెంకటేశ్‌, సల్మాన్, షారుఖ్ లాంటి యంగ్ హీరోల సరసనా ఆమే. ఏ సినిమా చూసినా దేవీ సాక్షాత్కారమే. ఎక్కడ చూసినా దేవీ జపమే. కన్ను మూసి తెరిచేలోగా ఫేవరేట్ హీరోయిన్ అన్నమాటకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. కన్నుమూసిన తర్వాత కూడా జ్ఞాపకాల్లో కదలాడుతూనే ఉంది.