80 రోజుల తర్వాత దొరికిన శ్రీకాంత్ డెడ్​బాడీ.. వీడని మిస్టరీ

80 రోజుల తర్వాత  దొరికిన శ్రీకాంత్ డెడ్​బాడీ.. వీడని మిస్టరీ

బోధన్, వెలుగు: 80 రోజుల క్రితం మిస్సైన డిగ్రీ స్టూడెంట్​చివరకు శవంగా కనిపించాడు. నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం ఖండ్ గావ్​ గ్రామానికి  చెందిన అంజుగుడే శ్రీకాంత్​పటేల్ ​బోధన్​లోని ప్రైవేట్​కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సెప్టెంబర్​23న కాలేజీకని ఇంటినుంచి బయలుదేరాడు. తిరిగి రాకపోవడంతో మరుసటిరోజు తండ్రి లక్ష్మణ్​​పటేల్ ​బోధన్​రూరల్ ​పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్​ కేసు నమోదు చేశారు. సోమవారం బోధన్​ సమీపంలోని పసుపువాగులో డెడ్​బాడీ కనిపించింది. పక్కనే కాలేజీ బ్యాగు, చెప్పులు ఉండడంతో శ్రీకాంత్​గా గుర్తుపట్టారు. శవం కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం  ఇవ్వడంతో బంధువులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి  చేరుకున్నారు. శవం శ్రీకాంత్​దేనంటూ బోరున విలపించారు. పోలీసులు కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్థులు బోధన్​– -రుద్రూర్​మెయిన్​రోడ్డుపై ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే టెంట్​వేసుకుని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బైఠాయించారు. దీంతో ఎక్కడి వెహికల్స్​అక్కడే నిలిచిపోయాయి. శ్రీకాంత్ డిగ్రీ కాలేజీలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని తండ్రి లక్ష్మణ్​​పటేల్​ చెప్పారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజు అమ్మాయి బంధువులపై కేసు నమోదు  చేయాలని చెబితే పట్టించుకోలేదన్నారు. బలవంతంగా మిస్సింగ్​కేసు నమోదు చేశారని ఆరోపించారు. కొడుకు ఆచూకీ తెలపాలని బోధన్​ఏసీపీ, రూరల్ ​పోలీస్ ​స్టేషన్ల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని వాపోయారు. అమ్మాయి తరపు బంధువులే హత్య చేశారని ఆరోపించారు. నిందితులను అరెస్టు చేయాలని, కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్​ డీసీపీ అర్వింద్​బాబు, ఆర్డీవో రాజేశ్వర్  పరిశీలించారు. 

రేపు విద్యాసంస్థల బంద్​కు పిలుపు

శ్రీకాంత్​హత్యను నిరసిస్తూ స్టూడెంట్​యూనియన్​లీడర్లు బోధన్​ రైల్వే గేట్​వద్ద రాస్తారోకో చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. మంగళవారం బోధన్​లో స్కూళ్లు, కాలేజీల బంద్​కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. గంటపాటు  రాస్తారోకో నిర్వహించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. 

డెత్​ మిస్టరీ ఛేదిస్తాం

మిస్సింగ్ స్టూడెంట్ డెత్​ కేసును మర్డర్, ఆత్మహత్య కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. మిస్సింగ్ కేసులో అనుమానితులను ఇప్పటికే విచారించాం. లభ్యమైన డెడ్​బాడీని శ్రీకాంత్ దిగా గుర్తించారు.  పోస్ట్ మార్టం రిపోర్ట్​తో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈ కేసులో మాపై రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్లు లేవు. పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే వారిపై  చర్యలు ఉంటాయి.  తొందరలో డెత్​ మిస్టరీని ఛేదిస్తాం.

– అర్వింద్​బాబు, డీసీపీ, నిజామాబాద్​