శ్రీలంక బ్లాస్ట్ : 207 మరణాలు.. 450 మందికి గాయాలు.. ఏడుగురు అరెస్ట్

శ్రీలంక బ్లాస్ట్ : 207 మరణాలు.. 450 మందికి గాయాలు.. ఏడుగురు అరెస్ట్

శ్రీలంకలో ఉగ్రవాదుల మారణ హోమం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంటగంటకు మరణాల సంఖ్య పెరిగింది.  హాస్పిటళ్లలో గాయాలతో అడ్మిట్ అయిన వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. విపత్తును ఎదుర్కొనేందుకు శ్రీలంక సైన్యాన్ని దింపింది. ప్రపంచ దేశాలు శ్రీలంకకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి.

ఆరు గంటలు.. 8 పేలుళ్లు. ప్రస్తుతానికి 207కు పెరిగిన మృతుల సంఖ్య. గాయపడినవారు కూడా 450కి పెరిగారు. శ్రీలంకలో మారణహోమం స్పష్టించారు ఉగ్రవాదులు. చర్చిలు, హోటళ్ల దగ్గర బాంబులు పేల్చి 207 మందిని బలి తీసుకున్నారు. వందలాది మంది ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఉగ్రదాడులతో హై అలెర్ట్ ప్రకటించింది శ్రీలంక సర్కార్. ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది.

పవిత్ర ఈస్టర్  రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్ధరిల్లింది. క్రిస్టియన్లు, టూరిస్టులే లక్ష్యంగా మూడు చర్చిలు, మూడు హోటళ్లు, జూపార్క్ దగ్గర పేలుళ్లు జరిపారు. పలుచోట్ల ఆత్మాహుతి దాడులు కూడా జరిపారు. చనిపోయిన వారిలో టూరిస్టులు, విదేశీయులు కూడా ఉన్నారు. మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నట్టు విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ చెప్పారు.

ఆరు గంటల్లోనే 8 బాంబు పేలుళ్లు జరిగాయి. సెయింట్ ఆంథోనీ చర్చిలో మొదటి పేలుడు జరగ్గా.. సెయింట్  సెబాస్టియన్  చర్చిలో రెండో బాంబు పేలింది. మూడో పేలుడు బట్టికలోవ ప్రాంతంలోని చర్చిలో జరిగింది. శాంగ్రిలా, సిన్నమన్ గ్రాండ్, కింగ్స్ బరి హోటల్స్ దగ్గర పేలుళ్లు జరిగాయి. జులాజికల్ పార్క్ దగ్గర కూడా పేలుడు జరిగింది. ఎనిమిదో పేలుడు కొలంబో శివారులోని దెమటగోడ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలో అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. బాంబు పేలి ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఇది ఆత్మాహుతి దాడిగా పోలీసుల అనుమానిస్తున్నారు.

పేలుళ్ల ధాటికి చర్చిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పైకప్పులు కుప్పకూలిపోయాయి. జనం కూర్చునే బల్లలన్నీ ముక్కలయ్యాయి. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనాస్థలాలు స్మశానాల్లా మారిపోయాయి. ఎక్కడ చూసినా మృతదేహాలతో చర్చిలు రక్తపు మడుగులుగా మారాయి. నెగోంబోలోనే 50 మంది చనిపోయారని అక్కడి పోలీసు ప్రధాన కార్యాలయం తెలిపింది. సెయింట్ ఆంథోనీ చర్చ్ లో 30 మంది మరణించారు.

ఘటనా స్థలాలు, ఆస్పత్రుల దగ్గర అంతులేని ఉద్వేగ వాతావరణం కనిపించింది. బాంబు పేలుళ్లలో గాయపడిన వారితో కొలంబో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ప్రార్థనల కోసం వచ్చిన వారు.. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడటంతో వారిలో ఎవరైనా తమ వారు ఉన్నారా అని.. చాలామంది ఆస్పత్రులకు వెళ్లి ఆరా తీశారు.  బాధితుల ఆర్తనాదాలతో కొలంబో కన్నీరు కార్చింది.

శ్రీలంక సర్కార్ దేశమంతా హై అలెర్ట్ ప్రకటించింది. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశ భద్రాతమండలితో ప్రధాని సమీక్షించారు. కేబినెట్ సమావేశమై తాజా పరిస్థితులపై చర్చిచింది. ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. కొలంబోలో కర్ప్యూ విధించారు. సోషల్ మీడియాను బ్యాన్ చేశారు. విమానాశ్రయాల్లో  హై అలెర్ట్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.

పేలుడు జరిగిన ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ జులాజికల్  గార్డెన్ ను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీలంక బాంబు పేలుళ్లలో మృతి చెందినవారిలో ఒక భారతీయ మహిళ కూడా ఉన్నట్టు తేలింది. కేరళ రాష్ట్రంలోని కసర్ గడ్ కి చెందిన రసీనా పేలుళ్లలో చనిపోయినట్టు. కేరళ సీఎం కార్యాలయ వర్గాలు ధ్రువీకరించాయి. రసీనా తన భర్తతో కలిసి శ్రీలంక వెళ్లినట్టు సమాచారం.

పేలుళ్లకు బాధ్యులెవరనేది ఇంకా గుర్తించలేదు. బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని కొన్ని రోజుల క్రితమే శ్రీలంక ఇంటిలిజెన్స్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. 11 చోట్ల దాడులు జరగవచ్చని చెప్పినా  పట్టించుకోలేదని సమాచారం. పోలీసుల నిర్లక్ష్యమే వందలాది మందిని పొట్టన పెట్టుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.