గుడికి వెళ్తే బీజేపీలో చేరుతున్నట్టా? : శ్రీనివాస్ గౌడ్

గుడికి వెళ్తే బీజేపీలో చేరుతున్నట్టా? : శ్రీనివాస్ గౌడ్
  • నేను బీఆర్ఎస్‌‌ను వీడట్లేదు: శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: తాను బీజేపీలో చేరుతున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాను బీజేపీలో చేరడం లేదని, బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. తన పుట్టిన రోజు నాడు రామాలయానికి వెళ్లానని, గుడికి వెళ్లినంత మాత్రానా బీజేపీలో చేరుతున్నట్టా? అని ప్రశ్నించారు. 

ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసే వాళ్లపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తాను ఎలాంటి వాడినో బీఆర్ఎస్ నాయకత్వానికి తెలుసునని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో బహుజన నాయకత్వాన్ని రాజకీయంగా అంతం చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయి. 

బహుజన నాయకులు రాజకీయంగా ఎదిగితే, వారి మనుగడ సాగదని ఒక వర్గం భావించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌‌‌‌తోనే బహుజనులకు న్యాయం జరిగింది. బీఆర్ఎస్ అంటేనే బహుజన రాష్ట్ర సమితి’’ అని అన్నారు. ‘‘లిక్కర్ కేసులో కవిత అరెస్టును ఖండిస్తున్నం. కేసీఆర్‌‌‌‌ లక్ష్యంగానే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ప్రజలను అణచివేత, అవమానాలను గురిచేస్తే ఈ గడ్డపై మరో ఉద్యమం తప్పదు” అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, మళ్లీ ఐదేండ్ల తర్వాత బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్‌‌‌‌ హయాంలోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘ఎంక్వైరీల పేరుతో కేసీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దళిత బంధు, చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ పథకాలను అమలు చేస్తారా? చేయరా?” అని ప్రశ్నించారు.