ఏ పోలీస్ అయినా పౌరుల భద్రత, రక్షణను బాధ్యతగా తీసుకోవడం కామన్. అయితే, కరీంనగర్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ మాత్రం ప్రజల భద్రతే కాదు, వాళ్ళ ఆరోగ్యం కూడా తన బాధ్యతే అంటున్నారు. దానికోసం లాఠీతో పాటు గరిటె కూడా పట్టుకొని రుచికరమైన వంటలు వండుతున్నారు. మిల్లెట్స్ (తృణధాన్యాల)తో వందకుపైగా రెసిపీలు తయారుచేసి అందరికీ తినిపిస్తున్నారు. తాజాగా ఆయన తయారుచేసిన మిల్లెట్స్ బిర్యానీ బాగా పాపులర్ అయింది. చిరుధాన్యాలు తినడం సమాజ సేవతో సమానం అంటున్న శ్రీనివాస్, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నాడు.
శ్రీనివాస్ చిన్నతనం నుంచే తన తల్లి తృణధాన్యాలు తినడం అలవాటు చేసింది. రైస్ కి బదులుగా కొర్ర అన్నం, ఎండు కొర్రలు, అరికె అన్నం, వరిగె అన్నం, సజ్జ గట్క, పచ్చ జొన్న గట్క తినిపించేదట. దానివల్ల మిల్లెట్స్ పై అవగాహన పెరిగిన శ్రీనివాస్... సైబరాబాద్ లో పోలీస్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు కూడా చాలామంది ట్రైనింగ్ ఆఫీసర్లకు మిల్లెట్స్ ఫుడ్ నే తినిపించి శిక్షణ ఇచ్చాడు. దానివల్ల వాళ్లలో ఫిజికల్ ఫిట్ నెస్ బాగా పెరిగింది.
ప్రకృతి అందించిన దివ్య ఔషదం
మిల్లెట్స్ ప్రకృతి అందిచిన దివ్య ఔషదం. వీటిలోని పోషక విలువలు శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని శక్తిని అందిస్తాయి. కరోనా ఎఫెక్ట్ తో ప్రజల్లో హెల్దీ ఫుడ్ తినే అలవాటు పెరిగిపోయింది. కాకపోతే, ఏ ఫుడ్ తినాలి? ఎలా వండుకోవాలి? అనే విషయాలు చాలామందికి తెలియదు. అలాంటివాళ్లందరికీ సూచనలు శ్రీనివాస్ ఇస్తుంటారు.అంతేకాకుండా.. మిల్లెట్స్ పై రీసెర్చ్ చేసి వాటితో కొత్త కొత్త వంటకాలు కూడా తయారుచేశారు. వాటిలో టిఫిన్స్ మొదలుకుని, బిర్యానీ, ఐస్ క్రీమ్, స్వీట్స్, మిల్క్ షేక్స్ లాంటి చాలా రకాల రెసిపీలు ఉన్నాయి. వాటిని ఎలా తయారుచేయాలో కూడా వీడీయోలు తీసి వివరిస్తుంటారు.
ఫిట్ నెస్ కోసం
ఈ జెనరేషన్ పిల్లల్లో ఫిట్ నెస్ లోపం ఎక్కువ కనిపిస్తుంది. అలాంటి వాళ్లకు ఈ కొత్త రెసిపీలు తినిపించి ఫిట్ నెస్ పెంచొచ్చు. రాబోయే తరాలు కూడా పాత కాలపు ఆహారపు అలవాట్లని అలవరచుకోవాలి. దానివల్ల జీవన శైలి ఆరోగ్యంగా మారుతుంది. చిరుధాన్యాలు తింటే సమాజ సేవ చేసినట్లే అంటున్నారు శ్రీనివాస్. అందరూ ఈ ఆహారాన్ని అలవాటు చేసుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది. దాంతో రైతులు పంటను ఎక్కువగా సాగు చేస్తారు. అలా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అలవాటుని ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవడం వల్ల సమాజం ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ పంటకు నీటి వినియోగం తక్కువ. కావున నీరు ఆదా అవుతుంది.
ఆరోగ్యానికి మేలు
మిల్లెట్స్ లో జింక్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను బలంగా చేస్తాయి. నాడీ వ్యవస్త పని తీరును మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఎముకలు దృడంగా తయారవుతాయి. మిల్లెట్స్ మూడు పూటలా తిన్నట్లయితే డయాబెటిస్ పోతుంది. బీపీ కంట్రోల్ ఉంటుంది. ఇందులోని ఉన్న సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ కారణంగా ఒత్తిడి తగ్గుతుంది. డిప్రెషన్, అలసట దూరమవుతాయి. వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. నెగటివ్ మూడ్ నుంచి పాజిటివ్ మూడ్ లోకి వస్తారు. పోటీ పరీక్షలకు చదివేవాళ్లు ఇవి తింటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. మిల్లెట్స్ తినడంవల్ల ఎసిడీటీ, గ్యాస్, అజీర్థి వస్తాయని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. అవన్నీ తప్పని నిరూపించారు మైసూర్ కి చెందిన డిఫెన్స ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ పరిశోదకులు. మిల్లెట్స్ తిన్నప్పుడు ఇందులోని ఫైబర్ కారణంగా పొట్ట బరువుగా, ఉబ్బినట్లు అనిపిస్తుంది అంతేకానీ, ఎసిడిటీ లాంటి సమస్యలు తలెత్తవని నిరూపించారు. - కొలనుపాక భరత్
