శ్రీశైలం 3 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం 3 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం భారీగా ఉండటంతో డ్యాం నీటి మట్టం క్రమేపీ పెరిగి పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువయింది. దీంతో ఇరిగేషన్ అధికారులు శ్రీశైలం డ్యాం క్రస్టు గేట్లను ఎత్తి దిగువ సాగర్ కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు సమాచారం అందించి, తేదీని నిర్ణయించారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి జలాశయానికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అయినా కానీ అధికారులు నీటి ప్రవాహాన్ని పట్టించుకోకుండా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నంద్యాల ఎంపీ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప కలిసి అట్టహాసంగా గేట్లను తెరచి దిగువకు నీటిని విడుదల చేశారు. మొత్తం 3 క్రస్టు గేట్లను తెరచి దిగువకు నీటిని విడుదల చేశారు.   

గంటలో సీన్ రివర్స్..

ఎంతో ఆర్భాటంగా తెరిచిన శ్రీశైలం డ్యాం క్రస్టు గేట్లు.. గంట కూడా ఓపెన్ గా లేవు. తెరిచిన 3 గేట్లలో 2 గేట్లను అధికారులు వెంటనే మూసివేశారు. శ్రీశైలానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం తగ్గిపోయిందని అధికారులు 2 గేట్లను మూసివేశారు. జలాశయానికి వరద తగ్గుముఖం పట్టిందని ఇంకా రెండు రోజులు వేచిచూద్దాం అనే ధోరణి లేకుండా అధికారులు ప్రజాప్రతినిధుల మెప్పుకోసం నీటిని వృధాగా వదిలారని పలువురు విమర్శిస్తున్నారు. దింతో ప్రచార ఆర్భాటానికి మాత్రమే గేట్లను తెరిచారని పలువురు విమర్శిస్తున్నారు.