ఎట్టకేలకు ముహూర్తం ఖరారు... శ్రీశైలంలో ఫిబ్రవరి 21 న మహా కుంభాభిషేకం

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు... శ్రీశైలంలో ఫిబ్రవరి 21 న మహా కుంభాభిషేకం

శ్రీశైలం దేవస్థానంలో మహాకుంభాభిషేకం నిర్వహణపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 16 నుంచి శ్రీశైలం దేవస్థానంలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించి 21న మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని దేవాదాయశాఖ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కుంభాభిషేకం నిర్వహణకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను దేవాదాయశాఖ న్యాయవాది కోర్టుకి అందజేశారు. ఈ వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం పిల్ పై విచారణ మూసివేసింది.

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో జరగవలసిన మహా కుంభాభిషేకం వాయిదాల పర్వం ముగిసింది. గతేడాది మేలో జరగవలసిన మహాకుంభాభిషేకం ఎండలు ఎక్కువగా ఉన్నాయని, భక్తులు క్షేత్రానికి రాలేరన్న నెపం చూపిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ వాయిదా వేశారు. మహాకుంభాబిషేకం నిర్వహణ ముహూర్తం నిర్ణయించేందుకు దేవస్థానం ఏడు నెలలు సమయం తీసుకోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది.


 శ్రీశైలంలో మహాకుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణను వాయిదా వేస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్‌ చైర్మన్‌ సంగాల సాగర్‌ ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతేడాది మే నెలలో విచారణ జరిపిన ధర్మాసనం... ముహూర్తం తిరిగి ఖారారు చేయాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, శ్రీశైలం దేవస్థానం ఈవోను ఆదేశించింది. అందుకోసం సంప్రదింపుల ప్రక్రియను గరిష్ఠంగా ఆరు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

మహాకుంభాభిషేకం నిలుపుదలపై హైదరాబాద్‌కు చెందిన అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్‌ ఏపీ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేసింది. . ఈ వ్యాజ్యంపై  పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనను వినిపిస్తూ.. ‘మహాకుంభాభిషేకం వాయిదా విషయం లో దేవదాయ శాఖ కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకు నే అధికారం కమిషనర్‌కు లేదు. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు. 

వివాదం ఏంటంటే...

శివాజీ గోపురానికి మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు గతేడాది ఈవో లవన్న ఆధ్వర్యంలో రూ.కోట్లు వ్యయం చేసి ఏర్పాట్లు చేశారు. శివాజీ గోపురంతో పాటు ప్రధానాలయాలు, ఉపాలయాలకు పరంజాలు సిద్ధం చేశారు. రంగులతో అలంకారాలు, విద్యుద్దీపాల ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ముహూర్తాలు   ఖరారు చేశారు. ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇక ప్రారంభమే తరువాయి అన్న క్షణంలో ముహూర్తం నిర్ణయించే విషయంలో పీఠాధిపతులకు ప్రాధాన్యం ఇవ్వలేదని వివాదం మొదలైంది. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారింది. ఉత్తరాయణంలో చేయాల్సిన కార్యాన్ని దక్షిణాయనంలో (కార్తికమాసం) చేస్తామని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ప్రకటించి అగ్నికి ఆజ్యం పోశారు.