శ్రీశైలం 10 గేట్లు ఎత్తిన అధికారులు 

శ్రీశైలం 10 గేట్లు ఎత్తిన అధికారులు 
  • జూరాల 38 గేట్లు తెరిచిన్రు 
  • భద్రాచలం వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక 
  • అలర్ట్ అయిన అధికారులు
  • రెండు నదులపై భారీ వరదలతో నిండిపోయిన ప్రాజెక్టులు

ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వస్తుండడంతో గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.  ప్రాజెక్టులు నిండుకుండల్లా మారి కళకళలాడుతున్నాయి. దీంతో అధికారులు ఎక్కడికక్కడ గేట్లను ఎత్తి వరద నీటిని కిందికి పంపిస్తున్నారు. తుంగభద్ర, జూరాల నుంచి  వరద పెరగడంతో బుధవారం శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను అధికారులు ఓపెన్ ​చేశారు. ఈ వరద నాగార్జునసాగర్ కు చేరడంతో గురువారం గేట్లు ఎత్తి నీటి విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు ​కర్నాటక నుంచి నీటి ప్రవాహం పెరగడంతో జూరాల 38 గేట్లను ఎత్తారు. ఇంకోవైపు గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మంగళవారం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు గోదావరి 50.60 అడుగులకు పెరగడంతో బుధవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా సింగూరులో కూడా రెండు గేట్లను ఎత్తి వరదను కిందికి వదులుతున్నారు.