‘కాళేశ్వరం’ అక్కర్లేకుండానే నిండిన ఎస్సారెస్పీ

‘కాళేశ్వరం’ అక్కర్లేకుండానే నిండిన ఎస్సారెస్పీ

ఎస్సారెస్పీ గేట్లు ఓపెన్‌

ఎనిమిది గేట్లు ఎత్తిన ఇంజనీర్లు

25 వేల క్యూసెక్కుల నీళ్లు నదిలోకి

ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 57వేల క్యూసెక్కుల వరద

హైదరాబాద్‌/మోర్తాడ్​, వెలుగు: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు నాలుగు గేట్లను ఎత్తిన ఇంజనీర్లు.. సాయంత్రం మరో రెండు గేట్లు ఓపెన్‌ చేశారు. రాత్రి 8.30 గంటలకు ఇంకో రెండు గేట్లు ఓపెన్‌ చేసి.. మొత్తం ఎనిమిది గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 57 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. వరద కాల్వకు 13 వేల క్యూసెక్కులు, మిగతా కాల్వలు, ఇతర ఔట్‌లెట్లకు 11 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. రిజర్వాయర్‌ పూర్తి నిల్వ కెపాసిటీ 90.31 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 89.76 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.

కాళేశ్వరంతో అక్కర్లేకుండానే నిండిన ఎస్సారెస్పీ

కాళేశ్వరం ప్రాజెక్టుతో అవసరం లేకుండానే ఎస్సారెస్పీ వరుసగా రెండో ఏడాది పూర్తిగా నిండింది. ఎస్సారెస్పీకి నీళ్లు ఇవ్వడానికి కాళేశ్వరంలో భాగంగా రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి చేపట్టిన ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం’ రెండో ఏడాది కూడా నడపాల్సిన అవసరం రాలేదు. కేవలం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలోని చెరువులు నింపడానికే ఈ యేడాది పునరుజ్జీవం మోటార్లను నడిపించారు. అలా ఎత్తిపోసిన ఒక టీఎంసీ నీటిని వరద కాలువలో నిల్వ ఉంచారు. ఎస్సారెస్పీ నుంచి వరద కాల్వ గేట్ల ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉన్నా.. కాళేశ్వరం ప్రాజెక్టు మైలేజ్‌ పెంచేందుకే కింది నుంచి ఎత్తిపోశారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా వరద కాల్వలోకి ఎత్తిపోసిన నీళ్లు వరద ఎక్కువ కావడంతో మిడ్‌ మానేరుకు చేరాయి. రేపోమాపో మిడ్‌ మానేరు గేట్లు ఎత్తి ఆ నీళ్లను నదిలోకి వదిలేసే అవకాశం ఉంది.

మేడిగడ్డలో 0.87 టీఎంసీలు

ప్రాణహితకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుండటంతో మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తి వరదను గోదావరిలోకి వదులుతున్నారు. ఇదివరకు బ్యారేజీలో 10 టీఎంసీల వరకు నీటి నిల్వను మెయింటేన్‌ చేస్తూ మిగిలిన నీటిని కిందికి వదిలిన ఇంజనీర్లు.. క్రమేణ మేడిగడ్డలో నిల్వను తగ్గించారు. సోమవారం సాయంత్రం వరకు బ్యారేజీలో 16.17 టీఎంసీలకు గాను  0.87 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ బ్యారేజీకి 62 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 46 గేట్లు ఎత్తి 82 వేల క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి 29 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా 25 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు వదులుతున్నారు.

నీళ్లన్నీ సముద్రంలోకే!

కాళేశ్వరం నుంచి ఈ ఏడాది 18 టీఎంసీల వరకు ఎత్తిపోయగా.. వాటిలో 12 టీఎంసీల నీళ్లు మిడ్‌ మానేరులో నిల్వ ఉంచారు. మిగతా 6 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి తిరిగి గోదావరిలోకి చేరాయి. నిరుడు ఎస్సారెస్పీకి భారీ వరద వచ్చినా మిడ్‌ మానేరుకు రిపేర్ల పేరుతో గేట్లు ఎత్తి వరద నీటినంతా వదిలేశారు. ఈ ఏడాది నిలకడగా వస్తున్న వరదను మిడ్‌ మానేరుకు మళ్లించి నాలుగు టీఎంసీలకు పైగా నీటిని నింపారు. ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లు మళ్లీ గోదావరిలోకే చేరే అవకాశముంది.

అటు నాగార్జునసాగర్​.. ఇటు శ్రీరాంసాగర్

కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తుతుండటంతో ఈ రెండు నదులపై నిర్మించిన ప్రధాన ప్రాజెక్టులు నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల గేట్లు ఓపెన్​ చేశారు. ఇటీవల నాగార్జున సాగర్​ గేట్లు ఎత్తగా.. సోమవారం శ్రీరాంసాగర్​ గేట్లు ఎత్తారు. ఇలా ఒకే సీజన్​లో ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి అని ఇంజనీర్లు చెప్తున్నారు. జూరాలకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది.

For More News..

సిటీలో మళ్లీ మొదలైన నైట్ లైఫ్

ఆల్టర్నేట్​ రోడ్లు లేవు.. స్కైవే లేదు

వరంగల్​ వార్​కు పార్టీలు రెఢీ