పట్టాభిషేకంలో స్పెషల్ అట్రాక్షన్ గా 'సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం'

పట్టాభిషేకంలో స్పెషల్ అట్రాక్షన్ గా 'సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం'

2022 సెప్టెంబరులో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్‌ రాజు అయ్యేందుకు అర్హత సాధించారు. తాజాగా కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం సందర్భంగా అందరి దృష్టీ.. ఆయన తలపై అలంకరించే కిరీటంపై పడింది. చార్లెస్ చారిత్రక సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని ఈ రోజు కింగ్ చార్లెస్ III తలపై అలంకరించనున్నారు పట్టాభిషేకం రోజు ఇలా కిరీటధారణ చేయడం శతాబ్దాల నుంచి వస్తోన్న ఆచారం. టవర్ ఆఫ్ లండన్ బయట అత్యంత అరుదుగా కనిపించే ఈ బంగారు కిరీటాన్ని.. బ్రిటన్ రాజు అయిన తర్వాత.. ఆయన గంట కంటే తక్కువసేపే ధరిస్తారు. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి భద్రపరుస్తారు. ఈ నేపథ్యంలో ఈ కిరీటం ప్రత్యేకత ఏంటి? దీని పాత్ర ఏంటన్న దానిపై ప్రాధాన్యత సంతరించుకుంది.

తల్లి మరణానంతరం చార్లెస్ రాజు అయ్యారు. పట్టాభిషేకం అనేది పురాతన కాలం నుంచి వస్తోన్న ఆచారం. రాజుగా ఆయన పాలన ప్రారంభమైందని తెలిపేందుకే ఈ కిరీటధారణ చేస్తారు. అమూల్యమైన ఈ సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని పట్టాభిషేకం సమయంలో మాత్రమే ధరిస్తారు. అంతేకాదు పట్టాభిషేకం మొత్తంలో ఇదే చాలా అరుదైన సన్నివేశంగా పరిగణింపబడుతుంది.

 22 క్యారెట్ల మేలిమి బంగారంతో తయారైన ఈ కిరీటం.. 360 ఏళ్ల నాటిది. ఈ కిరీటం 30 సెం.మీ (1 అడుగు)కు పైగా ఎత్తు, దాదాపు 2.23 కిలోల బరువు ఉంటుంది. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చివరిసారిగా 1953లో పట్టాభిషేకం సమయంలో క్వీన్ ఎలిజబెత్ II ధరించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు సుమారు 70 ఏళ్లలో ఈ కిరీటం అత్యంత అరుదుగా టవర్ ఆఫ్ లండన్‌ నుంచి బయటకు వచ్చింది.

కిరీటం గొప్పతనం..

బ్రిటీష్ రాజు ధరించే ఈ కిరీటంలో 444 మణులు, రత్నాలు ఉన్నాయి. ఖరీదైన నీలమణులు, కెంపులు, పుష్యరాగాలు ఉన్నాయి. వీటిలో లేత నీలం లేదా నీలి, ఆకుపచ్చ మణులతో పాటు బంగారు మౌంట్స్‌లో వీటిని అమర్చారు. కిరీటంలోని రత్నాలను తీయడానికి, పట్టాభిషేకం సమయంలో మళ్లీ అమర్చడానికి వీలుండేది. అయితే, 20వ శతాబ్దంలో రత్నాలను శాశ్వతంగా కిరీటంలో పొదిగారు.

1661లో చార్లెస్ II కోసం ఈ కిరీటాన్ని తయారు చేశారు. అంతకు ముందు ఆంగ్లో-సాక్సాన్ రాజు, సెయింట్ అయిన ఎడ్వర్డ్ ది కన్ఫెసర్ దగ్గర ఇలాంటిదే ఒక కిరీటం ఉండేది. ఆ తర్వాత దాని పేరునే దీనికి పెట్టారు. 11వ శతాబ్దం బేయెక్స్ టేపెస్ట్రీలో ఆయన కిరీటం ధరించినట్లు సాక్ష్యంగా ఓ ఫొటో కూడా ఉంది. ఎడ్వర్డ్‌ కిరీటాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. బ్రిటన్ రాజులు, రాణుల పట్టాభిషేకంలో మాత్రమే ఈ కిరీటాన్ని ఉపయోగించారు. అయితే, కింగ్ చార్లెస్ Iకు మరణ శిక్ష విధించిన తర్వాత 1600ల్లో ఇతర రాజాభరణాలతోపాటు అప్పటి కిరీటాన్ని కూడా కరిగించారు.

క్రోమ్‌వెల్ మరణం తర్వాత మళ్లీ రాచరికం వచ్చింది. కింగ్ చార్లెస్ II కొత్త రాజాభరణాలు చేయించారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం, కొత్త స్టేట్ క్రౌన్‌ కూడా అందులో ఉన్నాయి. ఎడ్వర్డ్ కిరీటంలో మణులు, రత్నాలు కొన్నే ఉండేవని చెబుతారు. క్రౌన్ జువెల్స్ చరిత్రకారులు అన్నా కీ చెప్పిన వివరాల ప్రకారం చార్లెస్ II చేయించిన కిరీటంలో వజ్రాలు, రత్నాలను పొదిగారు. ప్రైవేట్ బ్యాంకర్, స్వర్ణకారుడు అయిన రాబర్ట్ వినెర్‌కు 500 పౌండ్లు చెల్లించి వాటిని ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. వాటి విలువ ఇప్పుడు 75 వేల పౌండ్లు ఉంటుందని అంచనా.

కిరీటంలోని పట్టీకి నాలుగు శిలువలు, లిల్లీ డిజైన్, మధ్యలో కలిసేలా నాలుగు ఆర్చిలు ఉంటాయి. వీటిపై చిన్న చిన్న బంగారు పూసలు ఉంటాయి. అంతకుముందు ఇమిటేషన్ ముత్యాల వరుస స్థానంలో వీటిని పెట్టారు. కిరీటానికి పైన మిరుమిట్లు గొలిపే రత్నాలు పొదిగిన శిలువ ఉంటుంది. రాజు పాలన ఉండే ప్రపంచాన్ని సూచించేలా ఒక ‘మాండే’ఉంటుంది. దీన్ని 1661లో తయారు చేసినప్పటికీ, ఇప్పటివరకూ సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని ధరించిన వారిలో చార్లెస్ ఏడో చక్రవర్తి మాత్రమే ఉండడం గమనార్హం.

ఈ కిరీటం బహిరంగంగా కనిపించడం అరుదైన విషయమే అయినప్పటికీ .. అందరికీ సుపరిచితమైనదిగానే అనిపిస్తుంది. బ్రిటన్ పాస్‌పోర్టులపై ఉండే కోట్ ఆఫ్ ఆర్మ్‌‌లో లేదా రాయల్ మెయిల్ పోస్ట్‌ బాక్సులు, వాహనాలపై ఉండే లోగోలో విలక్షణమైన ఈ కిరీటాన్ని మనం చూడొచ్చు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ క్రౌన్ కార్టూన్ ఎమోజీ కనిపించబోతోంది. పట్టాభిషేకానికి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టి ట్విటర్‌లో పోస్ట్ చేసినప్పుడు ఈ కార్టూన్ క్రౌన్ ఎమోజీ ఆటోమెటిక్‌గా వస్తుంది. రాచరిక చిహ్నంగా సెయింట్ ఎడ్వర్డ్‌ కిరీటం ఉండాలని క్వీన్ ఎలిజబెత్ II సూచించగా.. కింగ్ చార్లెస్ తన పాలన ఆరంభానికి చిహ్నంగా వేరే లోగోను ఎంచుకున్నారు. కానీ పట్టాభిషేకం సమయంలో సెయింట్ ఎడ్వర్డ్‌ కిరీటానికి ఉన్న ప్రాధాన్యం మాత్రం కొనసాగుతోంది. ‘‘సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం పట్టాభిషేకం కోసం మాత్రమే. దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది’’ అని చారిత్రక రాయల్ ప్యాలెస్‌ల చరిత్రకారుడు చార్లెస్ ఫర్రిస్ అన్నారు.

 అందుకే, మే 6న జరిగే పట్టాభిషేకంలో సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చూసే అరుదైన అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత, సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం తిరిగి టవర్‌కు చేరుకుంటుంది. తదుపరి రాజు పట్టాభిషేకం చేసే వరకు ఈ కిరీటం అక్కడే ఉండనుంది.