సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట.. 35 మంది మృతి

సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట.. 35 మంది మృతి

ఇరాన్ టాప్ కమాండర్ జనరల్ ఖాసిం సులేమానీ అంతిమ యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. గత శుక్రవారం బాగ్దాద్‌లో డ్రోన్ దాడులు చేసి ఖాసిమ్‌ను అమెరికా హత్య చేసింది. గతంలో భారీ సంఖ్యలో అమెరికన్లను చంపాడని, మళ్లీ తమ పౌరులు, ఆస్తులపై దాడికి ఖాసిమ్ కుట్ర చేశాడని, అందుకే చంపామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.

తమ దేశ టాప్ కమాండర్‌ను చంపడంపై ఇరాన్ రగిలిపోతోంది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ ఇరాన్ ప్రజలు నినదిస్తున్నారు. ఈ క్రమంలో ఖాసిం స్వస్థలమైన కెర్మాన్‌లో మంగళవారం జరిగిన అంతిమ యాత్రలో వేలాదిగా జనం పాల్గొన్నారు. అమెరికాకు, ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుకేస్తే రాలనంత జనం పోగై భావోద్వేగంతో ముందుకు కదులుతున్న సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని ఇరాన్ నేషనల్ ఎమర్జెన్సీ సర్వీస్ చీఫ్ పిరోసైన్ కూలివాండ్ తెలిపారు. ఈ ఘటనలో 35 మంది మరణించగా.. మరో 48 మందికి గాయాలయ్యాయని ఆ దేశ టీవీ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.