దుబ్బాక దంగల్.. మొదలైన పోలింగ్

దుబ్బాక దంగల్.. మొదలైన పోలింగ్
  • 2 వేల మంది పోలీసులతో బందోబస్తు
  • కరోనా​ గైడ్​లైన్స్​ ప్రకారం ఓటింగ్
  • 80 ఏండ్లు పైబడినోళ్లకు పోస్టల్​ బ్యాలెట్​

సిద్దిపేట, వెలుగురాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్​ హీట్​ రాజేస్తున్న దుబ్బాక బై ఎలక్షన్​కు పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ సెంటర్ల వద్ద ఓటర్లు క్యూ కట్టారు.  ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాన పార్టీల క్యాండిడేట్లతో కలిపి 23మంది ఎన్నికల బరిలో నిలువగా.. వారి భవితవ్యం లక్షా 98 వేల 807 మంది ఓటర్లు తేల్చనున్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 315 పోలింగ్​ స్టేషన్లకు సోమవారమే ఎలక్షన్​ స్టాఫ్​ తరలివెళ్లింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ నిర్వహిస్తారు. సాయంత్రం​5 గంటల వరకు కామన్​ ఓటర్లకు, 5 నుంచి 6 గంటల వరకు కరోనా పాజిటివ్​ ఓటర్లకు చాన్స్ ఇవ్వనున్నారు. కొవిడ్​ గైడ్​లైన్స్​ ప్రకారం ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్​ కేంద్రాల్లో  ఓటర్లు  సోషల్ డిస్టెన్స్ పాటించేలా మార్కింగ్​ చేశారు. 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మహిళా ఓటర్లే ఎక్కువ

దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం లక్షా 98వేల 807 మంది ఓటర్లు ఉండగా, వీరిలో మహిళలే ఎక్కువ. 97 వేల 978 మంది పురుషులు ఉండగా..  లక్షా 778 మంది మహిళలు ఉన్నారు. వీరికి 51 సర్వీస్ ఓటర్లు అదనం. మొత్తంగా ఏడు మండలాల్లోని 148 గ్రామాల్లో 315 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేశారు. నియోజకవర్గాన్ని  32 సెక్టార్ రూట్లుగా విభజించి, ఒక్కో సెక్టార్​కు ఒక్కో ఆఫీసర్ ను నియమించారు. ఒక్కో పోలింగ్​స్టేషన్​కు ఒక్కో ఈవీఎం చొప్పున ఏర్పాటు చేసిన ఆఫీసర్లు.. మరో 120 ఈవీఎంలను స్టాండ్​బైగా రెడీ ఉంచారు.

80ఏండ్లు పైబడినోళ్లకు పోస్టల్​ బ్యాలెట్​

80 ఏండ్లు పైబడిన వయోవృద్ధులకు పోస్టల్  బ్యాలెట్ ఓటింగ్​కు చాన్స్​ ఇచ్చారు. ఇలాంటి వారు1,550 మంది ఉండగా.. వీరిలో  1,340 మంది  పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటికే తమ ఓటు వేశారు.అంధులైన ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో  బ్రెయిలీ లిపితో కూడిన బ్యాలెట్ పేపర్లను రెడీగా ఉంచారు.

కొవిడ్  గైడ్​లైన్స్​ ప్రకారం ఓటింగ్​

కరోనా ఎఫెక్ట్​ కారణంగా  దుబ్బాక బై ఎలక్షన్స్​లో కొవిడ్  గైడ్​లైన్స్​ను ఆఫీసర్లు స్ట్రిక్ట్​గా అమలు చేస్తున్నారు.  అన్ని పోలింగ్​ కేంద్రాల్లో  ఓటర్లు  సోషల్ డిస్టెన్స్ పాటించేలా మార్కింగ్​ చేశారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి ఓటరుకు చేతికి గ్లౌజులు  ఇవ్వడంతో పాటు థర్మల్ స్క్రీనింగ్  చేశాకే లోపలికి అనుమతిస్తారు. డ్యూటీలో ఉండే సిబ్బంది ఫేస్ గార్డ్ లు, గ్లౌజులు ధరించేలా చూస్తున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఓట్లు వేసేందుకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు టైం కేటాయించారు. వీరికి పీపీఈ  కిట్లు అందజేసి ఓట్లు వేసేలా చూస్తారు. నియోజకవర్గంలో కరోనా కారణంగా130 మంది హోం క్వారంటైన్​లో ఉండగా.. 73  మంది ఇప్పటికే పోస్టల్​ బ్యాలెట్​ వినియోగించుకున్నారు.

ఎలక్షన్​ డ్యూటీలో 5 వేల మంది

పోలింగ్​, బందోబస్తు సిబ్బంది కలిపి 5 వేల మంది వరకు డ్యూటీలో ఉంటున్నారు. వీరిలో 3వేలమంది పోలింగ్​ సిబ్బంది కాగా.. 2వేల మంది పోలీసులు. దుబ్బాకలోని లచ్చపేట మోడల్​ స్కూల్​లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​ నుంచి పోలింగ్ ​మెటీరియల్​తో ఆఫీసర్లు, సిబ్బంది పోలింగ్​ సెంటర్లకు సోమవారం తరలివెళ్లారు. 400 మంది పీవోలు, 400 మంది ఏపీవోలతో పాటు మరో  800 మందిని అడిషనల్​ పోలింగ్ ఆఫీసర్లుగా నియమించారు. సిద్దిపేట పోలీస్ ​కమిషనర్ ఆధ్వర్యంలో 10 మంది ఏసీపీ/డీఎస్పీ స్థాయి ఆఫీసర్లు,  22 మంది సీఐలు, 54 మంది ఎస్ఐలు, 390 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, 1,519 మంది కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటున్నారు. 104 కేంద్రాలను వెబ్ కాస్టింగ్ , 98 కేంద్రాలను వీడియోగ్రాఫర్స్ తో, 113 కేంద్రాలను అన్ మ్యాన్డ్  కెమెరాలతో ఆఫీసర్లు పర్యవేక్షించనున్నారు. 80 మంది మైక్రో అబ్జర్వర్ల సేవలూ వినియోగించుకోనున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం

దుబ్బాక  బై ఎలక్షన్​ పోలింగ్  ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఎలాంటి అవాంఛీనయ ఘటనలు జరగకుండా  2 వేల మందితో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా, కొవిడ్​ గైడ్​లైన్స్​ పాటిస్తూ ఓట్లు వేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

– భారతి హోళికేరి, సిద్దిపేట జిల్లా కలెక్టర్