విశ్వాసం: ఆనందంగా జీవించాలి

విశ్వాసం: ఆనందంగా జీవించాలి

మనసు అల్లరిచిల్లరగా తిరగకుండా ఒక ఉన్నత లక్ష్యసాధనకై కృషి ప్రారంభించిననాడు జీవితానికి ఆనందం సిద్ధిస్తుంది. ఆ సాధనలో కష్టాలు కూడా ఆనందాన్నే కలిగిస్తాయి. సంతోషానికీ ఆనందానికీ భేదం ఉన్నది. సంతోషం అతి సులువుగా లభిస్తుంది. ఆనందం అంత సులభమైనది కాదు. మనసుకి సంబంధించిన వికాసకృషి ఆనందాన్ని కలిగిస్తుంది. .. అంటారు పెళ్లాడే బొమ్మా! నవలా లేఖావళిలో ఉషశ్రీ.సాధారణంగా మానవులు అల్లరిగా తిరగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే అటువంటి జీవన విధానం చాలా తేలికగా ఉంటుంది. అందుకోసం ఏమాత్రం కష్టపడనక్కరలేదు. కానీ ఒక లక్ష్యసాధన కోసం కృషి ప్రారంభిస్తే, అటువంటి వ్యక్తి జీవితానికి ఆనందం సిద్ధిస్తుంది. ఆ సాధనలో కలిగే కష్టాలు కూడా ఆనందాన్నే కలిగిస్తాయి. ‘ఆనందోబ్రహ్మ’ అంటోంది భారతీయ సనాతన ధర్మం.

ఆనందాలను చాలా పదాలతో కలిపి చెప్తుంటాం. బ్రహ్మానందం, విషయానందం, ఆత్మానందం, అద్వైతానందం, నిత్యానందం, యోగానందం, సహజానందం, పరమానందం, దివ్యానందం.. ఇలా కావలసినన్ని ఆనందాలు ఉన్నాయి. ‘ఆనందమే జీవిత మకరందం’ అన్నాడు ఒక కవి. మానవ జీవితంలో అంతటి ప్రాధాన్యం ఉంది ఆనందానికి.విద్యార్థులు చదువుకునే సమయంలో పరీక్షలకు ఎంతో కష్టపడి చదువుకోవలసి వస్తుంది. ఒక్కోసారి పరీక్షలప్పుడు అనారోగ్యం కూడా వస్తుంది. అయినా వేటినీ లెక్కచేయకుండా పరీక్షలు రాస్తారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులమయ్యామని తెలుసుకోగానే ఎంతో ఆనందిస్తారు. వారు పడిన కష్టాన్ని తీపి జ్ఞాపకంగా చెప్పుకుంటారు. 

రామాయణంలో... 

శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రావణుడు సీతమ్మను అపహరించి, లంకలో ఉంచుతాడు. సీతమ్మను వెతుకుతూ రాముడు ఎన్నో ఆటంకాలను అధిగమిస్తాడు. చివరకు లంకా నగరం చేరి, రావణుడిని సంహరించి, సీతమ్మను పుష్పకవిమానం మీద అయోధ్యకు తీసుకొస్తూ, దారి పొడవునా తాను ఏమేమి చేశాడు, ఎవరెవరిని కలిశాడు, ఎవరెవరిని సంహరించాడు.. అనే విషయాలను ఎంతో ఆనందంగా సీతమ్మకు వివరిస్తాడు. అంతకాలం అనుభవించిన కష్టాలను తీపి జ్ఞాపకంగా వివరిస్తూ, తన ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. సీతమ్మ కూడా ఒక ఏడాది కాలం రావణుడి చెరలో పడిన కష్టాలను మరచిపోయి ఆనందంగా ఉంటుంది. 

మహాభారతం విషయానికి వస్తే...

దుర్యోధనాదుల వల్ల... పాండవులు, ద్రౌపది, కుంతి ... మొదలైనవారంతా పడరాని కష్టాలు పడ్డారు. పదమూడేండ్లు అరణ్య, అజ్ఞాత వాసాలు ముగిసిన తరువాత, ఆ కష్టాలను స్మరించుకుంటారు. ‘ఇన్నేండ్లు మనం ఇన్ని ఇబ్బందులు పడినా, చివరకు ధర్మం జయించింది. మనమందరం ఆనందంగా ఉన్నాం’ అంటాడు ధర్మరాజు. అందుకే ‘ఒక కష్టం వెనుక ఆనందం తప్పకుండా ఉండి తీరుతుంది’ అంటారు పెద్దలు.

ఇక సంతోషం విషయానికి వస్తే...

సంతోషం అతి సులువుగా లభిస్తుంది. అంతే సులువుగా మనల్ని విడిచి వెళ్లిపోతుంది. కీచకుడు ద్రౌపది అందాన్ని చూసి విస్మయం చెందాడు. ఏ విధంగానైనా ఆమెను చెరపట్టి సంతోషించాలనుకున్నాడు. ఆమెను వెంటాడుతూ, అనకూడని మాటలు మాట్లాడుతూ, వికటాట్టహాసం చేస్తూ సంతోషించాడు. అంతా గమనించిన భీమసేనుడి చేతిలో కీచకుడు హతమయ్యాడు. అక్కడితో వాడి సంతోషం కూడా మరణించింది. సీతమ్మను చెరపట్టిన రావణుడు ఒక ఏడాది పాటు ఎంతో సంతోషంగా ఉన్నాడు. నిత్యం ఆమె దగ్గర అసభ్యంగా మాట్లాడుతూ, రాముడిని నిందిస్తూ సంతోషించాడు. ఆ సంతోషం క్షణికమని త్వరగానే అర్థం చేసుకున్నాడు. వానరసైన్యంతో లంక మీదకు దండెత్తి వచ్చి, రావణుడిని సంహరించాడు రాముడు. అక్కడితో రావణుడి సంతోషం ముగిసిపోయింది. 

కొద్దికాలం మాత్రమే ఉండే సంతోషం కంటె నిత్యం ఉండే ఆనంద సిద్ధి కోసం మహనీయులు కృషి చేశారు. సాక్షాత్తు పరమశివుడిని పతిగా పొందడం కోసం పార్వతీదేవి కఠినమైన తపస్సు చేసింది. బలిష్టంగా ఉండే పురుషులకు మాత్రమే సాధ్యమయ్యేంత కఠోర తపస్సు చేసిందని స్వయంగా సప్త ఋషులు ఆమెను ప్రశంసిస్తారు. అద్వైత ఆనందాన్ని పొందడం కోసమే పార్వతి ఇంత కఠోర తపస్సు చేసినట్లు కాళిదాసు తన ‘కుమారసంభవం’ కావ్యంలో చెప్పాడు. ఆనందం అర్ణవమైతే అని శ్రీశ్రీ అన్నారు. ఆనందాన్ని సముద్రమంత పరిమాణంతో పోల్చి చెప్పారు శ్రీశ్రీ. ‘సంతోషం సగం బలమైతే, ఆనందం జీవితకాలం బలం’ అని చెప్తున్నారు మన పెద్దలు.
- డా. వైజయంతి పురాణపండ ఫోన్​ :80085 51232