ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి, వెలుగు: భవిష్యత్ అవసరాల కోసమే రోడ్ల విస్తరణ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి పట్టణంలో కన్యకాపరమేశ్వరి కొత్త ఆలయ నిర్మాణానికి మంత్రి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి టౌన్ లో 4 దశాబ్ధాలుగా రోడ్ల విస్తరణ హామీగానే మిగిలిపోయిందని, తాను ఇచ్చిన మాట ప్రకారం రోడ్ల విస్తరణ చేపట్టామన్నారు. ఆలయం నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షలు శాంక్షన్​చేయగా తాను స్వంతంగా రూ.5 లక్షలు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అందులో మొదటి విడతగా రూ.1లక్ష ను ఆలయకమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం వనపర్తిలో వాల్మీకి బోయలను ఎస్టీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు  తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని,  దీక్ష విరమించాలని మంత్రి బోయలను కోరారు. జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి,  మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్  పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను స్పీడప్ ​చేయాలి: అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను స్పీడప్​చేయాలని  అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్​ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్​లోని తన చాంబర్​లో  అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లతో రివ్యూ చేశారు.  మహబూబ్ నగర్ పట్టణంలోని జంక్షన్ల అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్లాటర్ హౌస్, కళాభారతి తో పాటు, సివిల్ వర్క్స్ ను స్పీడప్​చేయాలన్నారు. అనంతరం మెప్మా కార్యకలాపాలు,  కోర్టు కేసులపై సమీక్ష జరిపారు. భూత్పూర్, బడేపల్లి మున్సిపాలిటీల్లో  చేపట్టిన పనుల పురోగతిని తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ , భూత్పూర్, బాదేపల్లి మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్ కుమార్, నూరుల్ నజీబ్, మహమ్మద్ షేక్ , ఇంజినీర్లు పాల్గొన్నారు.   

బీజేపీ గెలుపు సంబరాలు

గద్వాల, వెలుగు: గుజరాత్​లో  వరుసగా ఏడోసారి బీజేపీ గెలవడంతో గద్వాల జిల్లా కేంద్రంలో  బీజేపీ లీడర్లు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ ఇంటి వద్ద,  వైఎస్సార్ ​చౌక్ వద్ద పటాకులు కాల్చి , స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, వెంకట్ రాములు, సంజీవ్ భరద్వాజ్, నాగేందర్ యాదవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణోత్సవాల సందర్భంగా ఆటల పోటీలు

కల్వకుర్తి, వెలుగు: పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ స్కూల్ స్థాపించి 50 ఏండ్లు నిండిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కృష్ణమోహన్​ గురువారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలోని స్టూడెంట్లకు  వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు.

కొడుకుతో గొడవపడి మహిళ ఆత్మహత్య

మరికల్​, వెలుగు : మండల కేంద్రంలో ఓ మతిస్థిమితం లేని మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఎస్సై అశోక్​బాబు వివరాల ప్రకారం.. మరికల్​కు చెందిన చాకలి చిట్టెమ్మ (46) భర్త చనిపోగా,  కుమారుడు ఆంజనేయులుతో కలిసి జీవిస్తుండేది.  కల్లుకు బానిసైన చిట్టెమ్మ కొంత కాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. బుధవారం రాత్రి తన కొడుకు ఆంజనేయులుతో గొడవపడడంతో అతడు  ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఇంట్లోని ఫ్యాన్​కు చీరతో ఉరేసుకుంది. కొంత సేపటికి  ఇంటికి వచ్చిన కుమారుడు చూసి వెంటనే ఓ ప్రైవేట్​వెహికల్​లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి  తీసుకెళ్లాడు. పరిస్థితి  విషమంగా ఉండటంతో, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా  అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆంజనేయులు కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు

కందనూలు, వెలుగు:  పాలమూరు –రంగా రెడ్డి ప్రాజెక్టు పనుల్లో భాగంగా కుమ్మేర ప్రాంతంలో  నివాసముంటున్న కూలీల గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస  కూలీలు  ‘మెగా కంపెనీ’ లో  పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్న భోజనం కోసం గ్యాస్​వెలిగించగా ప్రమాదవశాత్తు గ్యాస్​లీకై సిలిండర్​పేలింది. ప్రమాదంలో కూలీలు ఉమేశ్ (35) రాజ్ (20) కేతుసింగ్ (30) తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మెగా కంపెనీ యాజమాన్యం నాగర్​కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులను మెరుగైన చికిత్స కోసం  ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు  ఫైల్​చేసి దర్యాప్తు  చేస్తున్నారు. 

పార్లమెంట్​లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

మరికల్​, వెలుగు :  పార్లమెంట్​ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదింపజేయాలని టీఎమ్మార్పీఎస్​ రాష్ర్ట కార్యదర్శి కె. వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. గురువారం మండల కేంద్రంలోని డా.బీఆర్​.అంబేద్కర్​ విగ్రహం ఎదుట ‘చలో ఢిల్లీ’ పోస్టర్​ను  రిలీజ్​ చేశారు. కొత్త పార్లమెంట్​ బిల్డింగ్​కు డా.బీఆర్​.అంబేద్కర్​ పేరు పెట్టాలని డిమాండ్ ​చేశారు.  

బైక్, లారీ ఢీకొన్న ఘటనలో  ఇద్దరు 

కొత్తకోట, వెలుగు: బైక్, లారీ ఢీకొన్న ఘటనలో  ఇద్దరు చనిపోయారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన ఓంకార్ (27) పెబ్బేర్ లో నివాసం ఉంటున్నాడు. బుధవారం గ్రామానికి చెందిన గోపాల్(58)తో కలిసి బంధువుల పెళ్లికి వెళ్లాడు. రాత్రి బైక్​పై తిరిగి వస్తుండగా కొత్తకోట పట్టణం మదర్ థెరిసా జంక్షన్ సమీపంలో కర్నూలు వైపు నుంచి వస్తున్న  లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఓంకార్, గోపాల్ ను మహబూబ్​నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయారు. 

‘మన బడి’ పనులు గడువులోగా పూర్తి:   కలెక్టర్​ ఉదయ్​కుమార్​

కందనూలు, వెలుగు: జిల్లాలో ‘మన ఊరు– మన బడి’ ఫస్ట్​ఫేజ్ పనులు 290 స్కూళ్లలో చేపట్టగా, 188 స్కూళ్లలో 90 శాతం పూర్తి చేశామని కలెక్టర్​ఉదయ్​కుమార్​చెప్పారు.  గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ‘మన ఊరు– మన బడి’ అమలుపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ గడువు లోగా పనులను పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు. ప్రతి మండలం నుంచి 2 స్కూళ్లను మోడల్​స్కూళ్లుగా తీర్చిదిద్ది ఈ నెలాఖరులోగా ప్రారంభానికి సిద్ధం చేస్తామని చెప్పారు.200కు పైగా  ప్రైమరీ స్కూళ్లలో లైబ్రరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడిషనల్​కలెక్టర్ మోతిలాల్,  డీఈవో గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

‘తొలిమెట్టు’ ఫలితాలు వస్తలేవ్​ 

 చదువులో వెనుకబడిన పిల్లలపై టీచర్లు ఫోకస్​పెట్టడం లేదని అందుకే ‘తొలిమెట్టు’ స్కీంలో ఫలితాలు వస్తలేవని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆఫీసర్లపై సీరియస్​అయ్యారు. కలెక్టరేట్​లో డీఈవో, ఎంఈవో, ఎఫ్ఎల్ఎన్​లతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. చదువులో వెనుకబడిన స్టూడెంట్లకు 45 నిమిషాలు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు టైం కేటాయించాలని సూచించామని, కానీ కొందరు టీచర్లు పాటిస్తలేరన్నారు.  వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​హెచ్చరించారు. 

ఫిజికల్​ టెస్టుల్లో 256  మంది సెలక్ట్​

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్​లో గురువారం పోలీస్ తొలి ఈవెంట్స్  టెస్ట్ లో 256 మంది సెలక్ట్​ అయ్యారు. 600 మంది పురుషులకు కు గాను 461 మంది అభ్యర్థులు హాజరు కాగా, ఇందులో 256 మంది  అర్హత సాధించారు. రేడియో ఫ్రీకెన్వీ గుర్తింపు పద్ధతి ద్వారా నిర్వహించిన టెస్ట్ లో ముందుగా అభ్యర్థులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్  చేసి 1,600 మీటర్ల పరుగు పోటీ, ఎత్తు, బరువు, లాంగ్ జంప్, షాట్ పుట్ ఈ వెంట్స్ నిర్వహించారు. ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్లు ఆర్.వెంకటేశ్వర్లు, ఎం.చేతన పర్యవేక్షణలో జరిగాయి. నోడల్ ఆఫీసర్  ఎ.రాములు, డీఎస్పీలు పాల్గొన్నారు. 

స్కాలర్​షిప్​లు పెండింగ్​ పెట్టొద్దు:  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

వనపర్తి, వెలుగు: జిల్లాలో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్​లు పెండింగ్ లేకుండా వెంటనే రిలీజ్​చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం  కలెక్టరేట్​లో స్కాలర్​షిప్స్​పై ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్ల స్కాలర్ షిప్ అప్లికేషన్లను ఎప్పటికప్పుడు క్లియర్ ​చేయాలన్నారు. జనవరి 31లోపు స్కాలర్ షిప్ అప్లికేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. 18 ఏండ్లు నిండిన స్టూడెంట్లు ఓటర్ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వెల్ఫేర్​ఆఫీసర్​ నుషిత, డీఈవో రవీందర్, డీఐఈవో, తదితరులు పాల్గొన్నారు.

యువత వ్యాపారవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష 

నారాయణపేట, వెలుగు: యువత వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలెక్టర్​ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని నైపుణ్య శిక్షణా కేంద్రంలో ‘ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం’ పై  అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరై  సదస్సును ప్రారంభించిన  కలెక్టర్​శిక్షణ పొందేవారికి పలు సూచనలిచ్చారు.  పీఎంఈజీపీ స్కీమ్​కు 18 నుంచి 45  ఏండ్ల వయస్సు గల వారు అర్హులని, స్వయం ఉపాధి కోసం  59 కోర్సుల్లో 30 రోజుల పాటు  శిక్షణ కార్యక్రమాలు ఇస్తామన్నారు. శిక్షణ పొందిన వారికి వారి నైపుణ్యం మేరకు ఉపాధి కల్పిస్తామన్నారు.  గ్రామీణ,  పట్టణ ప్రాంతాల యువత ఈ అవకాశాన్ని  వినియోగించుకోవాలన్నారు. శిక్షణ పొందిన వారికి లోన్లు ఇస్తామని, దాంతో వారు సొంతంగా చిన్న చిన్న యూనిట్లు పెట్టుకొని లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం లో ఇండస్ట్రియల్ శాఖ జీఎం బాబు, ఆఫీసర్లు జ్యోతి, వెంకటేశ్వర్లు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. 

 

48 గంటల్లో వడ్ల పైసలు ఇవ్వాలి:  అడిషనల్ ​కలెక్టర్‌ మోతిలాల్

కందనూలు, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు 48 గంటల్లోగా  పైసలు ఇచ్చేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అడిషనల్​కలెక్టర్‌ మోతిలాల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లోని తన చాంబర్​లో వడ్ల కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ​మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయం చేసుకుంటూ 100 శాతం వడ్లు కొనాలని ఆదేశించారు.  ఇప్పటివరకు 2,909 మంది రైతుల వద్ద 42,356 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసి రూ.39.48 కోట్లు చెల్లించామన్నారు.  రైతులకు  గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. సివిల్ సప్లై ఆఫీసర్​మోహన్ బాబు, జిల్లా కో ఆపరేటివ్​ ఆఫీసర్​పత్యానాయక్, తదితరులు పాల్గొన్నారు. 

 

గిరిజన బాలిక మృతి కేసులో నిందితుల లొంగుబాటు

జడ్చర్ల టౌన్, వెలుగు: బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో గిరిజన బాలిక ఆత్మహత్య కేసులో  ముగ్గురు నిందితులు లొంగిపోయినట్లు  డీఎస్పీ మహేశ్​కుమార్ తెలిపారు. గురువారం జడ్చర్ల  పీఎస్​లో ఆయన మీడియా ముందు నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 2న తిరుమలగిరి కేశ్యా నాయక్ తండాలో రాత్రి  బాలికకు పరిచయం ఉన్న పక్క గ్రామమైన చిన్న రేవల్లికి చెందిన శివ అనే యువకుడు 
ఇంటికి రావడంతో అదే  తండాకు చెందిన బాలిక బాబాయ్ శ్రీను నాయక్ , శ్రీనివాస్​, సుదర్శన్​అనే మరో ఇద్దరు వ్యక్తులు శివను చితకబాది రూ. 10 వేలు డిమాండ్​చేశారు. రేపు పైసలు తెచ్చి ఇస్తానని శివ వెళ్లిపోయాడు. బాలికను కూడా డబ్బులు ఇవ్వాలని బ్లాక్​మెయిల్​చేయడంతో ఈ నెల 3న తెల్లవారుజామున సూసైడ్​చేసుకుంది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు ఫైల్​చేసినట్లు పోలీసులు తెలిపారు.  సీఐ జములప్ప, బాలానగర్ ఎస్సై జయప్రసాద్  ఉన్నారు.

బీఎస్పీ కృషితోనే ఆర్డీఎస్ కాల్వకు నీళ్లు

అలంపూర్, వెలుగు: తమ పార్టీ కృషితోనే ఆర్డీఎస్ కు  నీళ్లొచ్చాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశవరావు అన్నారు. ఉండవెల్లి మండల  పరిధిలోని ఆర్డీఎస్ –34  కెనాల్​ను గురువారం బీఎస్పీ లీడర్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 29న పాదయాత్రలో భాగంగా బీఎస్పీ లీడర్లు ఉండవల్లి మండల పరిధిలోని 34 వ కాలవను పరిశీలించారు. కాలువలో నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వకు నీళ్లు వదులకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. స్పందించిన ఎమ్మెల్యే,  ఆర్డీఎస్ ఆఫీసర్లు నీళ్లు వదిలారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు మహేశ్​, బీఎస్పీ  లీడర్లు బాలకృష్ణ, అయ్యన్న, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

 

కోర్టుకు వెళ్లిన వారికి ‘డబుల్’ ఇండ్లు ఇవ్వాలి

గద్వాల, వెలుగు: హైకోర్టు ఆదేశాల మేరకు  ఫస్ట్​ పట్టాలు పొందిన వారికి డబుల్​బెడ్​రూం ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ప్రతినిధి బస్సు మోహన్ రావు డిమాండ్ చేశారు. 2012లో దౌదర్ పల్లి శివారులోని సర్వేనెంబర్లు 968, 969, 979, 980, 983, 985 లలో గద్వాల టౌన్ కు సంబంధించి పేదలకు ఇండ్ల పట్టాలు  ఇచ్చారన్నారు. కాగా ఇటీవల ‘డబుల్’ ఇండ్లు,  నర్సింగ్ కాలేజీ పేరుతో పట్టాలు గుంజుకొని వాటిలో నర్సింగ్ కాలేజీ నిర్మాణం చేపట్టారని ఈ విషయంపై దాదాపు 650 మంది పట్టాదారులు కోర్టుకు వెళ్లారన్నారు.  అన్ కండిషనల్ గా పట్టాలు పొందిన వారికి ‘డబుల్’  ఇండ్లు కేటాయించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.