మంత్రి పదవి నాకు ప్రజలు పెట్టిన భిక్ష ; గంగుల కమలాకర్

మంత్రి పదవి నాకు ప్రజలు పెట్టిన భిక్ష ; గంగుల కమలాకర్
  • మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా పని చేస్తా
  • రేపటి ప్రజా ఆశీర్వాద సభకు తరలిరావాలి 
  • మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలో ఒకసారి గెలిచిన వ్యక్తి మరోసారి గెలవలేదని, తనను నమ్మి మూడు సార్లు గెలిపించారని, మంత్రి పదవి ప్రజలు పెట్టిన భిక్షేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ పట్టణంలోని స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, కోకన్వీనర్లతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమ ఫలాలు భవిష్యత్ తరాలకు అందాలంటే మరోసారి సీఎం కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలని, కేసీఆర్ లేని తెలంగాణ ఊహించుకోలేమన్నారు. మనం తప్పు చేస్తే భవిష్యత్ తరాలు అంధకారమవుతాయని హెచ్చరించారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టి మన సంపద దోచుకెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీలపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ 90కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హామీలకే పరిమితమని, కర్నాటకలో ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయన్నారు. 45 రోజులు తన కోసం పనిచేస్తే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నానన్నారు. నాలుగోసారి ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నెల 18న ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని, మంత్రి కేటీఆర్ హాజరయ్యే ఈ సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. సమావేశంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, లైబ్రరీ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఎంపీపీ లక్ష్మయ్య, పార్టీ మండల అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి గంగుల ఆశీర్వాద సభ నిర్వహించే మార్క్ ఫెడ్ గ్రౌండ్ ను పరిశీలించారు.