పాలసీని రెన్యువల్ చేయకపోవడం బ్యాంకు తప్పే : రాష్ట్ర వినియోగదారుల ఫోరం

పాలసీని రెన్యువల్ చేయకపోవడం బ్యాంకు తప్పే :  రాష్ట్ర వినియోగదారుల ఫోరం
  • చనిపోయిన పాలసీ హోల్డర్​ కుటుంబానికి బీమా సొమ్ము చెల్లించాల్సిందే
  • ఎస్‌‌‌‌‌‌‌‌బీఐకి రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశం

కరీంనగర్, వెలుగు: కస్టమర్ బ్యాంకు అకౌంట్‌‌‌‌‌‌‌‌లో సరిపడా డబ్బులు ఉన్నా ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయకపోవడం బ్యాంకు తప్పిదమేనని, చనిపోయిన అకౌంట్ హోల్డర్ కుటుంబానికి బీమా సొమ్ము చెల్లించాల్సిందేనని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఎస్‌‌‌‌‌‌‌‌బీఐని ఆదేశించింది. ఈ కేసులో గతంలో కరీంనగర్ జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పును సమర్థించింది. కరీంనగర్ కు చెందిన నర్రా కర్ణాకర్ రెడ్డి కరీంనగర్ ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ పద్మానగర్ బ్రాంచ్ లో 2013లో అకౌంట్ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

 అదే ఏడాది జులైలో సంవత్సర కాలపరిమితితో రూ.100 ప్రీమియం చెల్లించి యాక్సిడెంట్ పాలసీ తీసుకున్నాడు. 2015 మార్చి 19న కర్ణాకర్ రెడ్డి యాక్సిడెంట్ లో చనిపోయాడు. దీంతో ఆయన తండ్రి క్లెయిమ్ కోసం బ్యాంకులో అవసరమైన పేపర్లు సమర్పించాడు. బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలు స్పందించకపోవడంతో కరీంనగర్  జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఇన్సూరెన్స్ పాలసీ జూలై 11, 2015తోనే ముగిసిందని, తర్వాత ప్రీమియం చెల్లించనందున క్లెయిమ్ వర్తించదని బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీ వాదించాయి. 

అయితే పాలసీ గడువు ముగిసేనాటికి కర్ణాకర్ అకౌంట్ లో రూ.2,64,761 ఉండగా, చనిపోయేనాటికి రూ.1,37,722 బ్యాలెన్స్ తో  అకౌంట్ యాక్టివ్‌‌‌‌‌‌‌‌గానే ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీకి, కస్టమర్ కు మధ్య ఫెసిలిటేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న బ్యాంకు.. డబ్బులను కట్‌‌‌‌‌‌‌‌ చేసి పాలసీని రెన్యువల్ చేయడంలో నిర్లక్ష్యం వహించిందని, ఖాతాదారుడికి సరైన సమాచారం ఇవ్వలేదని జిల్లా కమిషన్ అభిప్రాయపడింది. ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం ఖాతాదారుల తరఫున ప్రీమియం చెల్లించే బాధ్యత బ్యాంకుదేనని పేర్కొంది. 

బ్యాంకు తన బాధ్యత నిర్వహించకపోవడం వల్లే బాధితుడి కుటుంబానికి నష్టం జరిగిందని, బ్యాంక్ బాధ్యత వహించి రూ.4 లక్షల బీమా సొమ్మును 9 శాతం వడ్డీతో చెల్లించాలని 2019 అక్టోబర్ లో తీర్పునిచ్చింది. దీంతో ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ స్టేట్ కమిషన్ ను ఆశ్రయించగా.. విచారించిన కమిషన్ జిల్లా కమిషన్  తీర్పునే సమర్థిస్తూ తీర్పునిచ్చింది.