సంక్షేమ పథకాలకు అడ్డా తెలంగాణ గడ్డ

సంక్షేమ పథకాలకు అడ్డా తెలంగాణ గడ్డ

వికారాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తాండారులో ఏర్పాటు చేసిన కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సబిత పాల్గొన్నారు.  స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మందికి మంత్రి కొత్త పెన్షన్ కార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, వితంతువుల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పెన్షన్ సౌకర్యం కల్పించారన్నారు. వికలాంగులకు నెలకి రూ.3 వేలు, మిగతా లబ్దిదారులకు రూ.2 వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నామన్న ఆమె... దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడంలేదని వెల్లడించారు.

దమ్ముంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న పథకాలను ప్రజలకు చెప్పాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాలు విసిరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి సబిత ధీమా వ్యక్తం చేశారు.