ప్రతీ పనికీ అంచనా ఖర్చులు అమాంతం పెంచిన రాష్ట్ర సర్కార్

ప్రతీ పనికీ అంచనా ఖర్చులు అమాంతం పెంచిన రాష్ట్ర సర్కార్
  • ఎనిమిదేండ్లలో రూ. 1.21 లక్షల కోట్లు పెంపు
  • డీపీఆర్​లో ఓ లెక్క.. పనులయ్యేటప్పుడు మరో లెక్క.. పూర్తయ్యే సరికి ఇంకో లెక్క
  • అంచనాలు పెంపు, పనుల సాగదీత కాంట్రాక్టర్లు, కమీషన్లకేనని ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన ప్రతి పనికి అంచనా ఖర్చులు అమాంతం పెంచింది. చేపట్టబోయే పనులకు కూడా పెంచుకుంటూ పోతున్నది. డీపీఆర్ ప్రపోజల్స్​లో ఒక లెక్క.. పనులు ప్రారంభించేటప్పుడు ఇంకో లెక్క.. పనులు పూర్తయ్యే సరికి మరో లెక్క చూపెడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మొదలైన ఈ తంతు కొత్త సెక్రటేరియెట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, జిల్లా కలెక్టరేట్లు, ప్రగతి భవన్, నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, మొన్న శంకుస్థాపన చేసిన ఎయిర్​పోర్ట్ మెట్రో దాకా అన్నిట్లో అంచనాలు పెంచుకుంటూ పోతున్నది. 

(మొదటిపేజీ తరువాయి)
డబుల్​, ట్రిపుల్​ చేస్తూ పోతున్నది.  పనులు మాత్రం ఆలస్యం చేస్తున్నది. ఇలా అన్నీ కలిపితే ఎనిమిదేండ్లలో దాదాపు రూ.1.21 లక్షల కోట్ల మేర అదనపు ఖర్చులు అవుతున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం అప్పులు తీసుకొని.. రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపుతున్నది. మాటిమాటికీ అంచనా వ్యయాలు పెంచడం, పనులను ఆలస్యం చేయడం వెనుక అనుకూల కాంట్రాక్టర్లకు మేలు చేయడం, కమీషన్లు దండుకోవడమనే మతలబు దాగి ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

ఇరిగేషన్ నుంచి మొదలు

అంచనాలు పెంచి.. లక్షల కోట్లు ఖర్చు చేసే ప్రక్రియను ఇరిగేషన్ డిపార్ట్​మెంట్ నుంచే ప్రభుత్వం మొదలుపెట్టింది. కాళేశ్వరంతో మొదలైన ఖర్చు పెంపు వ్యవహరం.. అన్ని ప్రాజెక్టులకూ కొనసాగుతున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్​ చేసి కాళేశ్వరంగా మార్చారు. ఇందుకోసం రూ. 80,190 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్‌‌ శాంక్షన్‌‌ ఇచ్చారు. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు అనుకున్న దానికంటే రూ.50 వేల కోట్లు అదనంగా ఖర్చు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం మొత్తం ఇప్పటికే రూ.1.15 లక్షల కోట్లు దాటగా.. ఇప్పుడు అడిషనల్ టీఎంసీ పేరుతో ఇంకింత ఖర్చు చేస్తున్నది. దీంతో ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే సరికి రూ. 1.30 లక్షల కోట్లు దాటుతుందని అధికారుల అంచనా. అదేవిధంగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్​ అంచనా వ్యయాలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. 2015లో రూ. 35,200 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఇప్పుడు రీ డిజైన్లు, పనులను జోడించి ఈ అంచనాలను పెంచుకుంటూ పోతున్నది. సవరించిన అంచనాలు రూ. 60 వేల కోట్లకు చేరాయి. ఇప్పటికీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. దీని ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంటే ముందు అనుకున్న దానికంటే రూ.25  వేల కోట్లు ఎక్కువ ఖర్చు కానుంది. ఈ రెండు ప్రాజెక్టులకే ప్రభుత్వం రూ.75 వేల కోట్ల అంచనా వ్యయాలు పెంచింది. ఇక ఇతర ప్రాజెక్టుల పెరిగిన అంచనాలు ఇంకో రూ.30 వేల కోట్లు ఉంటాయి. మొత్తంగా ఎనిమిదేండ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెంచిన ఖర్చే రూ. 1.05 లక్షల కోట్లకు  చేరింది.  
ఆ 4 హాస్పిటళ్లకు ముగ్గుపోయక ముందే  

రూ.1,570 కోట్లు  పెంచిన్రు

నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల పనులు మొదలు పెట్టకముందే అంచనా వ్యయం పెరిగింది. వరంగల్ హాస్పిటల్​ నిర్మాణానికి రూ.1100 కోట్లు అనుకుంటే అదీ కాస్త రూ.1,250 కోట్లకు చేరింది. మరోవైపు రూ. 2,679 కోట్లతో ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్‌‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వగా.. ఇప్పుడు అంచనా వ్యయం  రూ.4,100  కోట్లకు చేరింది. పూర్తయ్యేసరికి ఎంత అవుతుంతో తెలియని పరిస్థితి. ఈ నాలుగు హాస్పిటళ్ల అంచనా  వ్యయం ముగ్గుపోయకముందే  రూ. 1,570 కోట్ల వరకు పెరిగింది.

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అదనపు ఖర్చు రూ.11,143 కోట్లు

4 వేల మెగావాట్ల కెపాసిటీతో నల్గొండలోని దామరచర్ల వద్ద చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్  నిర్మాణం 2017 అక్టోబర్​లో ప్రారంభమైంది.  దీనికోసం రూ.30 వేల కోట్లు అవుతుందని తొలుత అంచనా వేశారు. అనుకున్నదాని ప్రకారం 2020 అక్టోబర్​లోనే ఇక్కడి రెండు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి మొదలుకావాలి. అయితే ఒక్క ప్లాంట్ నిర్మాణం కూడా పూర్తి కాలేదు. అంచనా ఖర్చును మాత్రం ఇంకో రూ.7 వేల కోట్లు పెంచారు. అంటే రూ. 37 వేల కోట్లకు ఖర్చు చేరింది. ఈ మొత్తం అప్పుల రూపంలోనే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకుంటున్నారు. దీంతో పాటు 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌‌ పవర్‌‌ స్టేషన్‌‌ ఖర్చు కూడా పెంచారు. ఈ స్టేషన్ ను మొత్తం రూ.7,857 కోట్లతో చేపడుతున్నారు. ఇది కాస్తా రూ.12 వేల కోట్లకు చేరుతున్నది. ఈ రెండు థర్మల్ పవర్ కేంద్రాలకే అనుకున్న దానికంటే రూ. 11,143 కోట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నది.

కమాండ్​ కంట్రోల్​ సెంటర్​కు రూ. 300 కోట్లు ఎక్స్​ట్రా

ఇటీవల ప్రారంభించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​కు  సీఎం కేసీఆర్ 2015 నవంబర్​లో  శంకుస్థాపన చేశారు. అప్పుడు రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని  అంచనా వేశారు. ఏడాది తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించారు. రెండున్నరేండ్లలో పూర్తి కావాల్సిన సెంటర్​ ఆరేండ్లకు పూర్తయింది. ఇది పూర్తి  కావడానికి రూ. 700 కోట్లు ఖర్చయింది.  అంటే అనుకున్న దానికంటే రూ.300 కోట్లు పెరిగింది. కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ను షాపూర్​జీ  పల్లోంజి సంస్థ చేపట్టింది. ఇక అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణం చివరి దశలో ఉన్నది.  హైదరాబాద్ లుంబినీ పార్కు వద్ద రూ.80 కోట్ల అంచనా వ్యయంతో  4 ఏండ్ల  కింద పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రూ.160 కోట్లు దాటుతోంది. 2016 లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్​ పక్కన అంబేద్కర్​ విగ్రహ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆరేండ్లు అయినా విగ్రహ ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదు. అంచనా ఖర్చులు రూ.104 కోట్లతో మొదలై.. ఇప్పుడు రూ.165 కోట్లకు చేరాయి. దాదాపు రూ.60 కోట్లు పెంచారు. అమరవీరుల స్మారక చిహ్నం, అంబేద్కర్ విగ్రహం పనులు ఏపీకి చెందిన కేపీసీ కన్ స్ట్రక్షన్స్ చేపట్టింది

అప్పులతోనే అంతా..!

ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలన్నింటికీ దాదాపు అప్పులే చేస్తున్నది. కొన్నింటికి బడ్జెట్​లో అరకొర కేటాయింపులు చేసింది. క్యాపిటల్ ఎక్స్​పెండిచర్ పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పులు చేయగా.. ఇతర నిర్మాణాల పరిస్థితి అలాగే ఉన్నది. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ గ్యారంటీలు ఇవ్వడం ఇలా అప్పులు తీసుకుంటున్నది.  అనుకున్న టైమ్​కు ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు. దీంతో ప్రాజెక్టులు, ఇతర కన్​స్ట్రక్షన్స్ పూర్తి కాకముందే వడ్డీలు కట్టుడు మొదలైతున్నది. వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేస్తున్నది. ప్రాజెక్టు వర్క్​ టైమ్​లోపు పూర్తవకుంటే.. ఇంకో 6 నెలలు, ఏడాది ఎక్స్​ట్రా  టైం తీసుకుంటారు. రాష్ట్రంలో మాత్రం ఏండ్లకెండ్లు నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్ రేట్లు పెరిగాయనే సాకు చూపూతూ అంచనాల ఖర్చు పెంచుతున్నారు. 2015, 2016, 2017లో చేపట్టిన పనులు  కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

సెక్రటేరియెట్​కు రూ. 400 కోట్లని చెప్పి.. 1,200 కోట్లకు చేర్చిన్రు

సెక్రటేరియెట్ నిర్మాణ ఖర్చు  రూ.400 కోట్లని మొదట అంచనా వేసి.. ఇప్పుడు రూ.1,200 కోట్లకు చేర్చారు. 2020 అక్టోబర్​లో  షాపూర్​జీ పల్లోంజీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఆలస్యం కావడంతో అంతకంతకూ ఖర్చు పెరుగుతూ పోయింది.  టెండర్లు అయ్యాక రూ. 619 కోట్లు ఖర్చవుతుందన్నారు.  ఆ తర్వాత ధరలు పెరిగాయని, నిర్మాణ ఖర్చు రూ.800 కోట్లు అవుతుందన్నారు. అది మళ్లీ వెయ్యి కోట్లకు చేరింది. ఇప్పుడు ప‌‌నులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ ఖర్చు మొత్తం ఈజీగా రూ. 1,200 కోట్లు చేరుతున్నది. ఇక జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి రూ.1,660 కోట్లు అంచనా వేస్తే.. అది కాస్తా రూ.2 వేల కోట్లకు చేరుతున్నది. ప్రగతి భవన్​ నిర్మాణానికి మొదట 
రూ.38 కోట్లు అని చెప్పి.. రూ.45.91 కోట్లతో పూర్తి చేశారు. 

ఎయిర్ పోర్ట్ మెట్రోకు 1,600 కోట్లు పెరిగింది

రాయదుర్గం(మైండ్​ స్పేస్) నుంచి శంషాబాద్ ఎయిర్​ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో కొత్త రూట్​కు ఇటీవల  సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్​లో  రూ.4,650 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే ఈ రూట్​కు త్వరలో సీఎం శంకుస్థాపన చేస్తారనే ప్రకటన వచ్చిన టైంలో ఖర్చు ఏకంగా రూ.1,600 కోట్లు పెంచేశారు. ఈ కొత్త రూట్​ (మెట్రో ఫేజ్​–2)కు మొత్తం రూ.6,250 కోట్లు అంచనా వ్యయం చూపారు. ఇక పూర్తయ్యే సరికి ఎంత అవుతుందోననే చర్చ జరుగుతున్నది.