పాత దవాఖాన్లలో కొత్త బెడ్లు

పాత దవాఖాన్లలో కొత్త బెడ్లు
  • పాత దవాఖాన్లలో కొత్త బెడ్లు
  •  9 నియోజకవర్గాల్లోనే కొత్త ఆస్పత్రులు కట్టాలని యోచన
  •  మిగిలిన చోట్ల బెడ్ల పెంపుతోనే సరి
  •  ప్రతి నియోజకవర్గానికో వంద బెడ్ల ఆస్పత్రి నిర్మిస్తామని గతంలో హామీ


హైదరాబాద్, వెలుగు:  ప్రతి జిల్లాకో నిమ్స్  తరహా హాస్పిటల్‌‌‌‌, ప్రతి నియోజకవర్గానికో వంద బెడ్ల హాస్పిటల్  నిర్మిస్తామని ఐదేండ్ల కిందట ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు అడ్డదారిలో చర్యలు ప్రారంభించింది. అయితే, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనట్లు ప్రతి నియోజకవర్గానికో వంద బెడ్ల దవాఖాన కట్టే యోచనలో సర్కారు లేదు. నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను వందకు పెంచాలని నిర్ణయించింది. మొత్తానికే దవాఖాన్లు లేని నియోజకవర్గాల్లో మాత్రమే కొత్తగా హాస్పిటళ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏయే నియోజకవర్గంలో ఎన్ని హాస్పిటళ్లు, వాటిలో ఎన్ని బెడ్లు ఉన్నాయో ఆరోగ్య శాఖ అధికారులు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌‌‌  రావుకు గురువారం నివేదిక అందజేశారు. 

మొత్తం 119 నియోజకవర్గాల్లోని  61 నియోజకవర్గాల్లో వంద బెడ్ల కెపాసిటీ ఉన్న ఆస్పత్రులు ఉన్నాయి. ఇంకో 38 నియోజకవర్గాల్లోని దవాఖాన్లలో బెడ్ల సంఖ్య 30 నుంచి 80 వరకూ ఉందని ఆఫీసర్లు వివరించారు. వాటిలో బెడ్ల సంఖ్యను వందకు పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించినట్లు తెలిసింది. అయితే, కొన్ని ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచేందుకు సరిపడా జాగా లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నియోజకవర్గాల్లో రెండేసి దవాఖాన్లను కలిపి ఒక దవాఖానగా చూపే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఉదాహరణకు మంథని నియోజకవర్గ కేంద్రంలో 50 బెడ్ల కమ్యూనిటీ హెల్త్  సెంటర్‌‌‌‌‌‌‌‌, 50  బెడ్ల మదర్‌‌‌‌‌‌‌‌  అండ్  చైల్డ్  హెల్త్‌‌‌‌ కేర్ సెంటర్  ఉన్నాయి. ఈ రెండింటిలో కలిపి వంద బెడ్లు ఉన్నందున, ఇక్కడ ఇంకో దవాఖాన నిర్మించడమో లేదా బెడ్ల సంఖ్య పెంచడమో అవసరం లేదన్న యోచనలో సర్కారు ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.

9 నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆస్రతులు లేవు

రాష్ట్రంలోని 9 నియోజకవర్గాల్లో ప్రైమరీ హెల్త్  సెంటర్లు మినహా ప్రభుత్వ దవాఖాన్లు లేవని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. చొప్పదండి, దేవరకద్ర, డోర్నకల్, మానకొండూరు, వైరా, ఉప్పల్, కుత్బుల్లాపూర్, బహదూర్‌‌‌‌‌‌‌‌పురా, కూకట్‌‌‌‌పల్లి నియోజకవర్గాలు ఈ లిస్టులో ఉన్నాయి. వాటిని ప్రథమ ప్రయారిటీగా తీసుకుని, కొత్తగా దవాఖాన్లను నిర్మించాలని మంత్రి సూచించారని అధికారులు చెబుతున్నారు. ఇంకో 11నియోజకవర్గాల్లోని వంద బెడ్ల దవాఖాన్లు లేవు. కానీ, ఈ నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా పెద్ద ఆస్పత్రులు ఉన్నందున ఆ నియోజకవర్గాల్లో కూడా దవాఖాన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సర్కారు  భావిస్తోంది. 

ఎన్నికల ప్రచారం కోసమే!

ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా నియోజకవర్గానికి వంద బెడ్ల హాస్పిటల్  నిర్మిస్తే, స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆపరేషన్ థియేటర్లు, ఇతర సౌకర్యాలు వంటివి చేకూరుతాయి. వంద బెడ్లకు తగ్గట్లు డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌ను నియమించాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు ప్రజలకు వైద్యసేవలు వారి ప్రాంతంలోనే అందుతాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఇప్పటికే ఉన్న హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్య పెంచడం వల్ల దవాఖాన్లు ఇరుకుగా మారిపోతాయని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఉన్నవన్నీ దశాబ్దాల కింద  నిర్మించిన దవాఖాన్లే కావడం గమనార్హం. 30 బెడ్ల కెపాసిటీతో నిర్మించిన దవాఖాన్లలో ఇప్పుడు బెడ్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. అప్పటి బిల్డింగుల్లో ఆపరేషన్ థియేటర్లు, సౌకర్యాలు కల్పించడం కూడా కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఆస్పత్రులు కట్టడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. బెడ్ల సంఖ్యను పెంచి, ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు.