ఒక్క విద్యార్థి చనిపోయినా ప్రభుత్వానిదే బాధ్యత

ఒక్క విద్యార్థి చనిపోయినా ప్రభుత్వానిదే బాధ్యత
  • ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీకి సుప్రీంకోర్టు హెచ్చరిక

న్యూఢిల్లీ: ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల రద్దు పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు పరీక్షల రద్దు చేసినా ఏపీ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. ఒకవేళ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉంటే దానిపై క్లారిటీ ఇవ్వండని జస్టిస్ ఖాన్ విల్కర్, జస్టిస్ మహేశ్వరిలతో కూడిన బెంచ్ కోరింది. పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నట్లు అసోం, పంజాబ్, త్రిపుర రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించగా.. ఏపీ, కేరళ మాత్రం ఇంకా తేల్చకపోవడంపై సుప్రీం కోర్టు గట్టిగా నిలదీసింది. 
సెప్టెంబర్ లో నిర్వహిస్తామని కేరళ స్పష్టం చేయగా.. జులై లో నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. అసలు మీ దగ్గర ఎంత మంది విద్యార్థులున్నారో తెలుసా అంటూ ఏపీ ప్రభుత్వ న్యాయవాది మహపూజ్ నజ్కిని సుప్రీం ప్రశ్నించగా..5 లక్షల మంది ఉన్నారని, ఒక్కో పరీక్ష గదికి 15 నుంచి 20 మంది విద్యార్థులు ఉంటారని తెలిపారు. ఒకవేళ జులైలో పరీక్షలు జరపలేని పరిస్థితి వస్తే ఏమిటని సుప్రీం కోర్టు ప్రశ్నించగా తక్కువ ప్రమాదకర పరిస్థితులను ఎంచుకుంటామని ఏపీ తెలియజేసింది. అయితే అనిశ్చితి లేకుండా వెంటనే అఫిడవిట్ ఇవ్వండి. ఏ ఒక్క విద్యార్థి చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అఫిడవిట్ సమర్పించేందుకు రెండు రోజులు సమయం కోరగా.. లేదు.. రేపే ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. కేసు విచారణను ఈనెల 24న చేస్తామని సుప్రీం కోర్టు ప్రకటించింది.