కృష్ణాలో 763 టీఎంసీలు ఇవ్వాల్సిందే.. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు

కృష్ణాలో 763 టీఎంసీలు ఇవ్వాల్సిందే.. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు
  • 70% వాటా కోసం కొట్లాడుతున్నం: ఉత్తమ్  
  • గత బీఆర్ఎస్ సర్కార్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నది 
  • గోదావరి జలాల్లోనూ చుక్క నీటిని వదులుకోం  
  • ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకు వెళ్తామని వెల్లడి 
  • కృష్ణా ట్రిబ్యునల్‌‌ విచారణకు హాజరైన మంత్రి

న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్-2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు తెలంగాణ బలమైన వాదనలు వినిపిస్తున్నది. క్యాచ్‌‌మెంట్ ఏరియా, బేసిన్‌‌లోని జనాభా, కరువు ప్రాంతం విస్తీర్ణం, సాగు భూములు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని 70% వాటాను ఇవ్వాలని కోరుతున్నది. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న కృష్ణా నీళ్ల వివాదంపై బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మంగళ వారం విచారణ ప్రారంభించింది.

మూడ్రోజుల పాటు జరిగే ఈ విచారణలో తెలంగాణ తన వాదనలు వినిపిస్తున్నది. ఈ విచారణకు అధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. తొలిరోజు విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ‘‘కృష్ణా జలాల్లో 763 టీఎంసీల కోసం పోరాడుతున్నాం. క్యాచ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏరియా, బేసిన్‌‌‌‌‌‌‌‌లోని జనాభా, కరువు ప్రాంతం విస్తీర్ణం, సాగు భూములు వంటి అంశాల ఆధారంగా ఈ లెక్కలు వేశాం. 

తద్వారా 75% డిపెం డబుల్ వాటర్‌‌‌‌‌‌‌‌లో 555 టీఎంసీలు, 65% డిపెం డబుల్ వాటర్‌‌‌‌‌‌‌‌లో 43 టీఎంసీలు, సగటు ప్రవా హాల నుంచి 120 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ నుంచి 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని కోరుతున్నాం. ఈ విషయంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్–2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు బలమైన వాదనలు వినిపిస్తున్నాం” అని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ చారిత్రాక తప్పిదాన్ని సరిచేసేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. 

కృష్ణా నీళ్లలో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై ఫిబ్రవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తున్నదని, ఇవి తుది వాదనలుగా భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తరఫున సీనియర్ అడ్వొకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు. ‘‘కృష్ణా నీళ్లలో రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం 1,050 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఇందులో దాదాపు 70% అంటే 763 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ను కోరుతున్నాం. జల వివాదాలకు సంబంధించిన విచారణకు ట్రిబ్యునల్ ముందు నీటి పారుదల శాఖ మంత్రి హాజరుకావడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి కావొచ్చు. దీన్ని బట్టి మా ప్రభుత్వం ఈ అంశాన్ని ఎంత సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు” అని అన్నారు. 

బేసిన్ పారామీటర్ల ఆధారంగా వాటా అడుగుతున్నం.. 
ఉమ్మడి ఏపీకి మొత్తం 1,005 టీఎంసీలు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిందని ఉత్తమ్ గుర్తు చేశారు. వీటిలో 75% నీటి లభ్యత ఆధారంగా 811 టీఎంసీలు, 65% డిపెండబిలిటీ ఆధారంగా 49 టీఎంసీలు, సగటు ప్రవాహాల ఆధారంగా 145 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అదనంగా గోదావరి డైవర్షన్ ద్వారా మరో 45 టీఎంసీలు కేటాయించారని పేర్కొన్నారు. అలాగే సగటు ప్రవాహాల కంటే ఎక్కువగా వచ్చే నీటిని వినియోగించుకోవచ్చని ట్రిబ్యునల్ స్వేచ్ఛనిచ్చిందన్నారు. ‘‘తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా బేసిన్ పారామీటర్ల ఆధారంగా రాష్ట్ర వాటాను కోరుతున్నాం. రాష్ట్ర వాటా కింద కృష్ణా నీళ్లలో 70 శాతం అంటే 763 టీఎంసీలు దక్కాలి. ఇది శాస్త్రీయమైన డిమాండ్. జాతీయంగా, అంతర్జాతీయంగా అమల్లో ఉన్న పారామీటర్ల ఆధారంగా మా వాటా కోరుతున్నాం. సగటు ప్రవాహాలపై మిగిలిన అదనపు నీటిని వినియోగించుకునే స్వేచ్ఛ కూడా తెలంగాణకే ఉంది” అని స్పష్టం చేశారు. 

ఆల్మట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నం.. 
పొరుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ నీటి వాటాలపై రాజీపడేది లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. “కర్నాటకలో కాంగ్రెస్ ఉన్నా, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా... తెలంగాణ తన హక్కుల కోసం బలంగా పోరాడుతుంది. ఆల్మట్టి ఎత్తు పెంచాలన్న కర్నాటక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. దానివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది. దీన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం” అని చెప్పారు. ‘‘కృష్ణా నీళ్ల అంశాన్ని మా ప్రభుత్వం సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసుపై సమీక్ష సమావేశం నిర్వహించి, పూర్తిస్థాయి వాదనలు వినిపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది కేవలం న్యాయ పోరాటం మాత్రమే కాదు.. రైతుల జీవనాధారానికి, కరువు ప్రాంతాల భవిష్యత్తుకు సంబంధించినది” అని అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో తీరని అన్యాయం.. 
తెలంగాణ రైతులకు గత బీఆర్ఎస్ సర్కార్ తీరని అన్యాయం చేసిందని ఉత్తమ్ మండిపడ్డారు. 811 టీఎంసీల్లో కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకుని, 512 టీఎంసీలను ఏపీకి కట్టబెడుతూ ఒప్పందం చేసుకున్నదని ఫైర్ అయ్యారు. ఇదే ఒప్పందాన్ని పదేండ్లు కొనసాగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు ఆ ఫైల్‌‌‌‌‌‌‌‌ను మళ్లీ తెరిచి, ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌లో మొదటి నుంచి వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌కు అన్ని ఆధారాలు సమర్పించామని తెలిపారు. తెలంగాణకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. “డిపెండబుల్ ఫ్లోస్ అయినా, సగటు ప్రవాహాలు అయినా, అదనపు నీరు అయినా, గోదావరి డైవర్షన్లు అయినా... తెలంగాణ తన హక్కు కోసం పోరాడుతుంది. రాష్ట్ర వాటాపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు” అని తేల్చి చెప్పారు.