
- దిగొచ్చిన సర్కార్టాయిలెట్లు, ఇతర పనుల కోసం జూనియర్ కాలేజీకి రూ. 2 కోట్లు శాంక్షన్
- తాత్కాలికంగా బయో టాయిలెట్ల ఏర్పాటు
- టాయిలెట్లు, ఇతర సౌలత్‌ల కోసం జూనియర్ కాలేజీకి రూ.2 కోట్లు శాంక్షన్
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్టూడెంట్ల పోరాటానికి రాష్ట్ర సర్కార్ దిగివచ్చింది. ఆ కాలేజీలో టాయిలెట్లు, అడిషనల్ క్లాస్ రూమ్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 2 కోట్లు శాంక్షన్ చేసింది. తాత్కాలికంగా బయో టాయిలెట్లను ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లా తాండూరు జూనియర్ కాలేజీకి కూడా ఇవే పనుల కోసం రూ.2 కోట్లు శాంక్షన్ చేసింది. ఈ మేరకు ఇంటర్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సరూర్‌నగర్ జూనియర్ కాలేజీలో 700 మందికి ఒకే ఒక్క టాయిలెట్ ఉండటంతో స్టూడెంట్లు ఈ నెల 19న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. టాయిలెట్లు లేకపోవడంతో తాము పడుతున్న ఇబ్బందులు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. టాయిలెట్లు నిర్మించకపోతే ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని హెచ్చరించారు. సరూర్‌నగర్ జూనియర్ కాలేజీ స్టూడెంట్ల గోసతోపాటు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో టాయిలెట్లు లేక స్టూడెంట్లు పడుతున్న ఇబ్బందులపై ‘‘ఒంటేలుకు ఎటుపోవాలె?’’ హెడ్డింగ్‌తో ఈ నెల 20న ‘వెలుగు’ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు స్పందించి.. ప్రభుత్వ తీరును ఎం డగట్టారు. కాలేజీకి వెళ్లి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి.. 2కోట్లు శాంక్షన్ చేసింది. సరూర్‌నగర్, తాండూరు జూని యర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ నుంచి గతంలో వచ్చిన వినతులను పరిశీలించి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులు రూ.5 కోట్లకు ప్రపోజల్స్ ఇచ్చారని, దాంట్లో రూ.4 కోట్లు (ఒక్కో కాలేజీకి 2కోట్ల చొప్పున) శాంక్షన్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.
అన్ని స్కూళ్లు, కాలేజీల్లో టాయిలెట్లు నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ
రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, తాళ్ల నాగరాజు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరూర్ నగర్‌తో పాటు దాదాపు చాలా కాలేజీల్లో టాయిలెట్లు లేవని తెలిపారు.
10 టెంపరరీ టాయిలెట్లు
సరూర్‌నగర్ జూనియర్ కాలేజీలో టాయిలెట్లను నిర్మించేందుకు నిధులు మంజూరుచేసినా, నిర్మాణం పూర్తయ్యే వరకూ టెంపరరీగా పది బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబిత ఆదేశించారు. మంగళవారం సాయంత్రమే ఆరు బయో టాయిలెట్లు కాలేజీకి చేరాయి. ఒకటీ, రెండు రోజుల్లో మిగిలిన నాలుగు కూడా వస్తాయని, వెంటనే వాటిని ఫిట్ చేస్తామని కాలేజీ ప్రతినిధులు చెప్పారు.