
- రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు: జర్నలిజంలో చరిత్రాత్మకమైన మార్పులు వస్తున్నాయని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేటటౌన్ లోని విపంచి కళావేదికలో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వార్తల సేకరణలో సామాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్తరూపం దాల్చాయన్నారు. టెక్నాలజీని సమగ్రంగా తెలుసుకుంటే న్యూస్ సేకరణ ఈజీ అవుతుందన్నారు. పాఠకుల అభిరుచులకు అనుగుణంగా వార్తలు ఉండాలన్నారు. త్వరలోనే మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ అంశంపై సెమినార్, వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామన్నారు.
జర్నలిస్ట్ లకు ఉచిత బస్ సౌకర్యం కల్పించే విధంగా అసెంబ్లీలో చర్చిస్తానని, సిద్దిపేట జర్నలిస్ట్ లకు సొంత డబ్బులతో రూ. 10 లక్షల బీమా కల్పిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. మొదటి రోజు శిక్షణలో సమాచార హక్కు చట్టంపై సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి, వార్త కథనాలు – ప్రత్యేక కథనాలు అంశంపై దిశా ఎడిటర్ మార్కండేయ, భాషా తప్పుఒప్పులు, దిద్దుబాటు అంశంపై విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వీ రామారావు బోధించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.