పోతన గ్రామాన్ని టూరిస్ట్ హబ్ గా అభివృద్ది చేస్తున్నాం

పోతన గ్రామాన్ని టూరిస్ట్ హబ్ గా అభివృద్ది చేస్తున్నాం

జనగామ జిల్లా: బమ్మెర పోతన జీవితం భావి తరాలకు ఆదర్శమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలమైన పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి.  ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతన మందిరాన్ని సందర్శించిన మంత్రి... పోతన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... తెలుగువారు గర్వించదగ్గ మహా కవి పోతన అని  కొనియాడారు. మహా భాగవతాన్ని రచించిన పోతన... జీవితాంతం సామాన్యుడిగానే బతికారన్నారు. తన రచనలను రాజులకు అంకితమివ్వకుండా రాముడికి అంకితమిచ్చి మహాభక్తుడనిపించుకున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పోతన గురించి అప్పటి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని, కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పోతన జన్మస్థలమైన బమ్మెరను టూరిస్ట్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా పోతన స్మారక మందిరాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. బాసర తరహాలో బమ్మెరలో అక్షరభ్యాస మందిర కేంద్రం ఏర్పాటుతో పాటు పోతన కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఇప్పటికే పాలకుర్తి బమ్మెర వల్మీడీ పర్యాటక కారిడార్ ఏర్పాటు రూ.25 కోట్లతో పనులు మొదలయ్యన్న మంత్రి... త్వరలోనే పాలకుర్తిలో సోమనాథుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, అధికారులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు పాల్గొన్నారు.