భూనిర్వాసితులను అన్నివిధాలుగా అదుకుంటాం : మంత్రి వాకిటి శ్రీహరి

భూనిర్వాసితులను అన్నివిధాలుగా అదుకుంటాం : మంత్రి వాకిటి శ్రీహరి
  • రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

మహబూబ్​నగర్( నారాయణ పేట), వెలుగు: భూనిర్వాసితులను అన్నివిధాలుగా అదుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్  ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు, మక్తల్, నారాయణపేట, కొడంగల్  నియోజకవర్గాల రైతులు తమ వ్యవసాయ భూములను ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, త్వరలోనే కొడంగల్  ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. మక్తల్, నారాయణ పేట, కొడంగల్​ నియోజకవర్గాల్లో భూములు కోల్పోతున్న రైతులకు రూ.20 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించడంతో భూములు కోల్పోతున్న రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. 

బీఆర్ఎస్​ పాలకులు జీవో 69ను చూపించి నారాయణపేట జిల్లా రైతులను, ప్రజలను మోసం చేశారన్నారు. సాగునీటికి, తాగునీటికి జిల్లావాసులు పడుతున్న కష్టాలను, కరువు పరిస్థితిని గమనించి రూ.4,350 కోట్లతో మక్తల్, నారాయణపేట, కొడంగల్  ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 1.25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు అడ్డంకులు సృష్టించి రైతులను రెచ్చగొట్టి రాజకీయాలు చేశారన్నారు. అవన్నీ పక్కకు పెట్టి రైతులు సంతోష పడేలా రూ.20 లక్షలు పరిహారం ఇవ్వడంతో రైతులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. 

కాంగ్రెస్  ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. అనంతరం భూములు కోల్పోతున్న న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతూ నారాయణపేటలో 60 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలను విరమింపజేశారు. ఆర్డీవో రాంచందర్​ నాయక్​, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మెన్  సదాశివరెడ్డి, నాయకులు సలీం, బండి వేణుగోపాల్​ పాల్గొన్నారు.