హుస్నాబాద్​కు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొస్త : పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్​కు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొస్త : పొన్నం ప్రభాకర్
  • మెడికల్​ కాలేజీ కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నం
  • రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్​, వెలుగు : హుస్నాబాద్​లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయిస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ​హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్​ను ఆదేశించినట్టు చెప్పారు.

మంగళవారం ఆయన మున్సిపల్​ పాలకవర్గం, అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా కలిసిరావాలని ప్రజాప్రతినిధులను కోరారు.​​ ఎన్నికల వరకే రాజకీయాలని, తరువాత ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. కరీంనగర్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల కూడలిలో హుస్నాబాద్​ ఉందని, ఇక్కడ మెడికల్​ కాలేజీ అవసరముందని తమ నాయకురాలు ప్రియాంకగాంధీ గుర్తించి హామీ ఇచ్చారన్నారు.

ఆమె మాట ప్రకారం మెడికల్​ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం యాభై ఎకరాల స్థలాన్ని చూస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు ఇక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్​ను ఆదేశించామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వారాలు, ముహూర్తాలు చూసుకోనన్నారు. మున్సిపల్​ పాలకవర్గం తన దృష్టికి తెచ్చిన రింగ్​రోడ్డు, సెంట్రల్​ లైటింగ్​ ఏర్పాటుతోపాటు హుస్నాబాద్​ను ఏవిధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు రూపొందించి ముందుకు తీసుకెళ్తానన్నారు.

డెవలప్​మెంట్​ విషయంలో తాను రాజీ పడబోనని, అవసరమైతే తమ ప్రభుత్వంతోనూ కొట్లాడతానని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు, ఇతర పనులు మినహా అన్ని రోజుల్లో తాను హుస్నాబాద్​లోనే ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం మంత్రి హుస్నాబాద్​లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అంతకుముందు ఆయన మార్నింగ్​ వాక్​ చేస్తూ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 

అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలి

సిద్దిపేట రూరల్:  అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మంగళవారం ఆయన సిద్దిపేట కలెక్టరేట్​లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం మారిందని, ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని, ప్రభుత్వ అధికారుల పనితీరు కూడా మారాలన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, సీపీ. ఎన్. శ్వేత, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.