
హుస్నాబాద్, వెలుగు : పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోచమ్మ కొట్టినట్టే ప్రజాస్వామ్య పాలనలో విర్రవీగేతనంతో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు పతనమవుతారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదని, ప్రజాస్వామ్యంలో అహంకారం పనికి రాదన్నారు. తాను మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో భాగమవుతూనే నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు.
ప్రజాస్వామ్య విలువలకనుగుణంగా పాలించేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. అలాంటి పార్టీలో ఉన్న తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని చెప్పారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. తాను ఇక్కడ లేకున్నా తమ ప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతోపాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.
హుస్నాబాద్‌లో మెడికల్ కాలేజీ, ఆర్టీఏ ఆఫీసుకు స్థలాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వీటితో పాటు ఇక్కడి క్రైస్తవుల కోరిక మేరకు క్రిస్టియన్కమ్యూనిటీ భవన్, క్రిస్టియన్ శ్మశానవాటిక నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఆర్డీవో బెన్శాలోమ్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, హుస్నాబాద్, కోహెడ, ఎల్కతుర్తి, సైదాపూర్, అక్కన్నపేట ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.