ఆ ఐదుగురు నేతలే కీలకం!..ప్రణీత్‌‌‌‌రావు, రాధాకిషన్‌‌‌‌ రావు స్టేట్‌‌‌‌మెంట్లు రికార్డు

ఆ ఐదుగురు నేతలే కీలకం!..ప్రణీత్‌‌‌‌రావు, రాధాకిషన్‌‌‌‌ రావు స్టేట్‌‌‌‌మెంట్లు రికార్డు
  • ఇద్దరు మాజీ మంత్రుల  ప్రస్తావన
  • ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ నిరూపించే కోణంలో దర్యాప్తు
  • స్పెషల్  పీపీ కోసం సీనియర్  అడ్వొకేట్ల పేర్లు పరిశీలన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎస్‌‌‌‌ఐబీ లాగర్‌‌‌‌‌‌‌‌ రూం ధ్వంసం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిందితులైన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్‌‌‌‌ రావు, భుజంగ రావు, తిరుపతన్న, రాధాకిషన్  రావు వెల్లడించిన వివరాల ఆధారంగా  తెరవెనుక ఉన్న నేతలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ దిశగా అనుమతి తీసుకునేందుకు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వ్యవహారం అంతా ఓ పార్టీ సుప్రీం, ఓ రాజ్యసభ సభ్యుడు, ఓ ఎమ్మెల్సీ, ఇద్దరు మాజీ మంత్రుల కనుసన్నల్లోనే జరిగినట్లు స్పెషల్‌‌‌‌  టీం  పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వాటికి సంబంధించి నిందితుల రిమాండ్‌‌‌‌  రిపోర్ట్‌‌‌‌, కస్టడీ రిపోర్ట్‌‌‌‌లో కీలక వివరాలు వెల్లడించారు. ప్రణీత్‌‌‌‌ రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారినట్లు తెలిసింది. 

కోర్టుకు సీల్డ్ కవర్ లో వాంగ్మూలాలు

ప్రధాన నిందితుడు ప్రణీత్‌‌‌‌ రావు సహా మాజీ డీఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్నతో పాటు టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ రిపోర్ట్‌‌‌‌ను పోలీసులు సీల్డ్‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌లో కోర్టుకు అందించారు. కేసు తీవ్రత నేపథ్యంలో స్పెషల్‌‌‌‌  పబ్లిక్‌‌‌‌  ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌ను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నలుగురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రాసిక్యూషన్  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌  అనుమతితో స్పెషల్‌‌‌‌  పీపీని నియమించనున్నారు. ట్యాపింగ్‌‌‌‌  ఆధారాలు సేకరించేందుకు ఇప్పటికే రెండు ప్రముఖ టెలికాం కంపెనీల సర్వీస్  ప్రొవైడర్లకు పోలీసులు లేఖ రాశారు. ఆ ప్రొవైడర్లు అందించే సమాచారం ఆధారంగా ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌పై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. ఆయనను ప్రశ్నిస్తే తప్ప ఈ కేసులో దర్యాప్తు ముందుకు వెళ్లే పరిస్థితులు లేనట్టు తెలిసింది. 

2018 నుంచి 2023  వరకు ఆపరేషన్స్

ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌  ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు పనిచేశామని ప్రణీత్  రావు, రాధాకిషన్  రావు వెల్లడించారు. పొలిటికల్  లీడర్లు టార్గెట్‌‌‌‌గా నిర్వహించిన ఆపరేషన్స్ గురించి తెలిపారు. వారి నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే సంబంధిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. 2018 నుంచి 2023 డిసెంబర్  వరకు ఎస్‌‌‌‌ఐబీ నుంచి జరిగిన ఆపరేషన్ల వివరాలను రాబట్టారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితుల స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా అనుమానితులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించనున్నారు. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ చేసి అక్రమాలకు పాల్పడ్డారని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఈడీకి లాయర్ ఫిర్యాదు 

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో మనీ లాండరింగ్‌‌‌‌పై దర్యాప్తు చేయాలని హైకోర్టు న్యాయవాది సురేష్‌‌‌‌ ఈడీకి ఫిర్యాదు చేశారు. హవాలా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని ఈడీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌లోని జాయింట్‌‌‌‌ డైరెక్టర్లకు ఫిర్యాదు చేశారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓ పార్టీ డబ్బులను పోలీసు వాహనాల్లో తరలించినట్లు కస్టడీలో నిందితులు వెల్లడించారని తెలిపారు. ఈడీ దర్యాప్తు జరిగితే ఫోన్‌‌‌‌ట్యాపింగ్‌‌‌‌ వెనుక ఉన్న రాజకీయ నాయకులు,చేతులు మారిన డబ్బు వ్యవహారం బయటకు వస్తుందని తెలిపారు. 

కోర్టుకు రాధాకిషన్ రావు

టాస్క్‌‌‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌‌‌ రావు కస్టడీ ముగియడంతో ఆయనను బుధవారం కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ విచారణలో రెండు సార్లు అస్వస్థతకు గురికావడంతో ఉదయం 9 గంటలకే ఆయనకు గాంధీ హాస్పిటల్‌‌‌‌లో వైద్య పరీక్షలు చేయించారు. 10.30 గంటలకే కోర్టులో హాజరుపరిచారు. ఆయన అప్పీల్‌‌‌‌  మేరకు కోర్టు పలు అనుమతులు ఇచ్చింది. జైల్లోని  లైబ్రరీకి వెళ్లవచ్చని, సూపరింటెండెంట్‌‌‌‌ను కలవవచ్చని  తెలిపింది. ఈనెల 12 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో  ఆయనను చంచల్‌‌‌‌గూడ జైలుకు తరలించారు