మల్యాల పొలాల్లో.. వెయ్యేండ్లనాటి శిల్పం

మల్యాల పొలాల్లో.. వెయ్యేండ్లనాటి శిల్పం

మల్యాల పొలాల్లో.. వెయ్యేండ్లనాటి శిల్పం

సిద్దిపేట జిల్లాలో గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోనే అతిపెద్ద ద్వారపాలకుడి శిల్పం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాలలోని పొలాల్లో బయటపడింది. వెయ్యేండ్లనాటి ఈ అపురూప శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు గుర్తించారు. బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్‌‌‌‌, మహమ్మద్‌‌ నసీరుద్దీన్‌‌ ఇచ్చిన సమాచారంతో ప్లీచ్‌‌ ఇండియా ఫౌండేషన్‌‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆదివారం ఈ శిల్పాన్ని పరిశీలించారు. భూమిపైన 6 అడుగులు, భూమిలోపల 3 అడుగులు, 9 అంగుళాల మందంతో, గ్రానైట్ రాతిలో చెక్కిన ఈ భారీ శిల్పం విష్ణుద్వార పాలకుడైన విజయునిదని శివనాగిరెడ్డి వెల్లడించారు.

శిల్పకళ, విగ్రహ లక్షణాన్ని బట్టి ఈ శిల్పం రాష్ట్రకూట అనంతర కళ్యాణ చాళుక్య తొలి కాలం.. అంటే క్రీ.శ.10వ శతాబ్దానికి చెందినదని ఆయన వెల్లడించారు. ఇంతకు ముందు ములుగు గణఫురంలో వెలుగు చూసిన 8 అడుగుల వైష్ణవ ద్వారపాలక శిల్పం కంటే ఈ శిల్ప పెద్దదని చెప్పారు. ఈ అరుదైన ఈ శిల్పాన్ని ఆదరించాలని, తర్వాతి తరాలకు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.