
కామారెడ్డి , వెలుగు: పాడి రైతులకు గవర్నమెంట్ లీటర్కు రూ. 4 చొప్పున ప్రకటించిన ప్రోత్సాహకం( ఇన్సెంటివ్) ఇవ్వడం లేదు. 22 నెలలుగా ఇన్సెంటివ్ చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 150 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి పాలను పోసే రైతులకు గతంలో గవర్నమెంట్ఇన్సెంటివ్ప్రకటించింది. గిట్టుబాటు ధర లేకపోవడం, దాణా, తవుడు ఇతర ఖర్చులు పెరిగిన దృష్ట్యా లీటర్కు రూ. 4 చొప్పున ఇచ్చే ప్రోత్సాహకంతోనైనా మేలు జరుగుతుందని రైతులు భావించారు. ఇన్సెంటివ్ప్రకటించిన మొదట్లో కొన్నాళ్లపాటు పాల బిల్లుతోపాటు చెల్లించారు. తర్వాత ప్రభుత్వం ఈ ల్యాబ్ సిస్టం తీసుకొచ్చింది. విజయ డెయిరీకి పాలు పోసే రైతుల వివరాలు, బ్యాంక్ అకౌంట్వివరాలను ఈ ల్యాబ్లో ఎంట్రీ చేశారు. కొన్నాళ్లపాటు మూడు, ఆరు నెలలకోసారి రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఇన్సెంటివ్ పైసలు జమ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీతో పాటు ముల్కనూర్, మదర్డెయిరీ రైతులకు కూడా కొన్నాళ్లపాటు ఇన్సెంటివ్ ఇచ్చారు.
రోజుకు 2.6 లక్షల లీటర్లకు పైగా సేకరణ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ రైతుల నుంచి పాలు సేకరిస్తోంది. 70 వేల మంది వరకు రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రతి రోజు సీజన్లో 3.50 లక్షల నుంచి 4.50 లక్షల లీటర్ల వరకు వస్తున్నాయి. ప్రస్తుతం 2.60 లక్షల లీటర్ల పాలు సమాఖ్యకు వస్తున్నాయి. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి ఎక్కువగా పాలు వస్తాయి. రైతులకు ఇన్సెంటివ్ పైసలు 2020 ఏప్రిల్వరకు చెల్లించారు. తర్వాత నుంచి చెల్లింపుల పక్రియ పూర్తిగా నిలిచిపోయింది. సగటున రోజుకు 2 లీటర్ల నుంచి 6 లీటర్ల వరకు పాలు పోసే రైతులు ఉన్నారు. ఒక్కో రైతుకు నెలకు రూ. 240 నుంచి రూ. 720 వరకు చెల్లించాల్సి ఉంది. మొత్తం 22 నెలలకు సంబంధించి రూ.150 కోట్ల మేర రైతులకు ప్రభుత్వం ఇన్సెంటివ్ బకాయి పడింది. గ్రామాల్లోని సెంటర్లలో పాలు పోసిన రైతులు స్థానిక సిబ్బంది, సమాఖ్య ప్రతినిధులను ఇన్సెంటివ్గురించి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో అన్నిరకాల ఖర్చులు పెరిగాయని, పాలకు ఆశించిన రేట్రావట్లేదని, ఇతరత్రా కారణాలతో చాలామంది రైతులు పశువులను అమ్మేస్తుండటంతో పాల సేకరణ గ్రామాల్లో తగ్గిపోతోంది. కామారెడ్డి జిల్లా నుంచి గతంలో విజయ డెయిరీకి రోజుకు 40 వేల నుంచి 50 వేల లీటర్ల వరకు పాలు వచ్చేవి. ప్రస్తుతం 25 వేల లీటర్ల లోపు వస్తున్నాయి. కనీసం పాలను సప్లయ్ చేసే రైతులకు ఇచ్చే ఇన్సెంటివ్ కూడా సకాలంలో ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైసలు రావట్లే
రోజుకు 5 లీటర్ల పాలు డెయిరీలో పోస్తున్నా. లీటర్కు రూ. 4 ఇన్సెంటివ్ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించింది. కొద్ది రోజులు ఇచ్చిన్రు. 2 ఏండ్ల నుంచి ఇన్సెంటివ్ పైసలు రావట్లే. గ్రామంలో ఉన్న సెంటర్లో అడిగితే వస్తాయని చెబుతున్రు. కానీ ఎప్పుడు వస్తయో ఏమో.
- శ్రీనివాస్, దేవాయిపల్లి, కామారెడ్డి జిల్లా
ఇస్తరో.. ఇవ్వరో..
నేను రోజు 3 లీటర్ల పాలు సెంటర్లో పోస్తా. పాల రైతులకు ఇన్సెంటివ్ పైసలు ఇస్తరో, ఇవ్వరో కూడా తెలియట్లేదు. 2 ఏండ్ల క్రితం వరకు వచ్చాయి. మార్కెట్లో ఇతర వస్తువుల ధరలు పెరిగినట్లు పాల ధర పెరగట్లేదు. నిర్వహణ ఖర్చులు మాత్రం రైతులకు బాగా పెరుగుతున్నాయి. వెంటనే ఇన్సెంటివ్బకాయిలు చెల్లించాలె.
- ప్రశాంత్, తాడ్వాయి, కామారెడ్డి జిల్లా